పీఎస్‌ఎల్వీ-సీ48 ప్రయోగం విజయవంతం

9 Foreign Satellites, ISRO Latest News, Isro Successfully Launches PSLV-C48, latest political breaking news, Mango News Telugu, national news headlines today, national news updates 2019, National Political News 2019, PSLV-C48 With RISAT-2BR1

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) డిసెంబర్ 11, బుధవారం సాయంత్రం 3.25 గంటలకి చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ48 ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ల్యాంచ్‌ ప్యాడ్‌ నుంచి పీఎస్‌ఎల్వీ-సీ48 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. మన దేశానికి చెందిన రీశాట్‌-2బీఆర్‌1తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ-సీ48 రాకెట్ మోసుకెళ్లింది. 9 కస్టమర్ ఉపగ్రహాలలో అమెరికాకి చెందినవి ఆరు కాగా, జపాన్, ఇటలీ, ఇజ్రాయిల్ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి. 628 కిలోల బరువు కలిగిన రీశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహం ఐదు సంవత్సరాల పాటు సేవలందించనుంది. వ్యవసాయం, అటవీ మరియు విపత్తు నిర్వహణ రంగాలకు రీశాట్‌ ఉపగ్రహాన్ని వినియోగించనున్నారు. ముందుగా ప్రయోగించిన రీశాట్‌-2బీకి కొనసాగింపుగా రీశాట్‌-2 బీఆర్‌-1 ప్రయోగం జరిగింది.

పీఎస్‌ఎల్వీ-సీ48 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్‌ కే.శివన్‌ ప్రకటించారు. పీఎస్‌ఎల్వీ-సీ48 రాకెట్‌ మోసుకెళ్లిన రీశాట్‌–2బీఆర్‌1 ఉపగ్రహన్నీ 576 కి.మీ.కక్ష్యలోకి ప్రవేశపెట్టామని తెలిపారు. అలాగే మిగతా 9 ఉపగ్రహాలు కూడా నిర్ణీత కక్ష్యలోకి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. పీఎస్‌ఎల్వీ-సీ48 50వ ప్రయోగమని, ఆర్‌.వి.పెరుమాళ్‌ సారథ్యంలో ఈ ప్రయోగాన్ని చేపట్టామని శివన్‌ అన్నారు. పీఎస్‌ఎల్వీ-సీ48 షార్‌ నుంచి చేపట్టిన 75వ ప్రయోగమని, దీంతో పీఎస్‌ఎల్వీ మరో మైలురాయి దాటిందని సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరంలో మరిన్ని ప్రయోగాలు చేపట్టబోతున్నామని ఈ సందర్భంగా శివన్‌ ప్రకటించారు. ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో పీఎస్‌ఎల్వీ 50 పేరుతో రూపొందించిన పుస్తకాన్ని శివన్ విడుదల చేశారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =