భారత పర్యటనలో భాగంగా దేశ రాజధాని న్యూఢిల్లీకి వచ్చిన బెల్జియం ప్రధాని బార్ట్ డి వీవర్ (Bart De Wever) భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై, ఆయన ప్రసంగ శైలిపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని మోదీ మాట్లాడే విధానం, ఆయన వ్యక్తపరిచే భావాలు ప్రపంచ నాయకులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన అనంతరం ఇరువురు నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బెల్జియం ప్రధాని మాట్లాడుతూ.. “విశ్వగురువుగా మారుతున్న భారతదేశ దూరదృష్టి కలిగిన నాయకుడు మోదీ. ఆయన ప్రసంగాలను వింటే ఎవరైనా సులభంగా ఆకర్షితులవుతారు, ఎంతో ప్రేరణ పొందుతారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ సాధిస్తున్న ప్రగతికి ప్రధాని మోదీ క్రియాశీలక నాయకత్వమే నిదర్శనం” అని కొనియాడారు. రెండు దశాబ్దాల తర్వాత బెల్జియం ప్రధాని భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ ద్వైపాక్షిక సమావేశంలో భారత్-బెల్జియం మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు మరియు ఆధునిక సాంకేతిక రంగాలు వంటి కీలక అంశాలపై ఇరు దేశాల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. యూరోపియన్ యూనియన్ (EU) మరియు భారత్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో బెల్జియం కీలక భాగస్వామిగా ఉంటుందని డి వీవర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనకు ముందు ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్-బెల్జియం భాగస్వామ్యం కేవలం రెండు దేశాలకే కాకుండా భారత్-ఈయూ బంధానికి కూడా కొత్త దిశను నిర్దేశిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డిఫెన్స్, టెక్నాలజీ విభాగాల్లో ఉమ్మడి భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులు మరియు ఉన్నతాధికారుల బృందం పాలుపంచుకుంది.




































