ఆశా వర్కర్లకు రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ – ఏపీ కేబినెట్ ఆమోదం

AP Cabinet Approves 12 Key Agendas Along With Gratuity Up To Rs.1.5 Lakh For Asha Workers

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, విద్య, వైద్యం, సంక్షేమం మరియు భూమి కేటాయింపులకు సంబంధించిన మొత్తం 12 కీలక అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు.

కేబినెట్ ఆమోదించిన ప్రధాన నిర్ణయాలు:

  • ఉచిత ఐఐటీ/నీట్ కోచింగ్ (విశాఖపట్నం): విశాఖపట్నం జిల్లా మరికవలసలో గిరిజన విద్యార్థుల కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇక్కడ IIT-JEE మరియు NEET పరీక్షలకు ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ అందిస్తారు.

  • విదేశీ వర్సిటీల రాకకు ‘కొత్త పాలసీ–2026’: ఏపీ విద్యా చట్టం–1982కు సవరణలతో పాటు విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో క్యాంపస్‌లు ఏర్పాటు చేసేలా ప్రోత్సాహకాలు, సదుపాయాలు కల్పించే నూతన విధానానికి ఆమోదముద్ర పడింది. విద్యార్థుల సిలబస్‌పై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం ఆదేశించారు.

  • ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ: సేవలో ఉండగా మరణించిన అర్హులైన ఆశా వర్కర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసాగా గ్రాట్యుటీని ఆమోదించారు. సేవ చేసిన ప్రతి ఏడాదికి రూ.5,000 చొప్పున గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు చెల్లిస్తారు.

  • తల్లికి వందనం విస్తరణ: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘తల్లికి వందనం’ మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతులకు రాటిఫికేషన్ ఇచ్చారు. అదనంగా 58,060 మందితో కలిపి ఈ పథకం మొత్తం 68,57,880 మందికి వర్తించనుంది.

  • రేపల్లె ఆసుపత్రి అప్‌గ్రేడేషన్: బాపట్ల జిల్లా రేపల్లెలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను రూ.58.42 కోట్ల వ్యయంతో 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి మరియు అదనంగా 66 పోస్టుల మంజూరుకు ఓకే చెప్పారు.

  • డైట్ ఛార్జీల పెంపు రాటిఫికేషన్: సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల డైట్ ఛార్జీలను పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులకు రాటిఫికేషన్ ఇచ్చారు.

  • APHIMS ప్రాజెక్టు: హార్టికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (APHIMS) ఏర్పాటుకు రూ.20.62 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు 72 నెలల పాటు అమలులో ఉంటుంది.

  • భూముల వర్గీకరణ & కేటాయింపులు:

    • కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ (KADA) అధికారుల అతిథి గృహం కోసం 1.69 ఎకరాల భూమి వర్గీకరణ మార్పు.

    • ప్రకాశం జిల్లా కొండపిలో బాలుర రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్ కోసం 7 ఎకరాల భూమి వర్గీకరణ మార్పు.

    • వైఎస్సార్ కడప జిల్లా పాతూరులో ఆలయ అభివృద్ధికి 7.66 ఎకరాల ప్రభుత్వ భూమిని దేవాదాయ శాఖకు బదిలీ.

    • ఎన్టీఆర్ జిల్లాలో అభ్యంతరం లేని ప్రభుత్వ పోరంబోకు భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణ ఉత్తర్వులకు రాటిఫికేషన్.

  • పేదలకు పట్టాభిషేకం: పట్టణాలకు వలస వచ్చిన పేదలు ప్రభుత్వ భూముల్లో కట్టుకున్న ఇళ్లకు న్యాయం చేసేందుకు ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు.

ప్రధాని మోదీకి ప్రత్యేక అభినందనలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల సుదీర్ఘ పాలనా ప్రస్థానాన్ని (గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా) పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సంస్కరణలను కొనియాడుతూ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన రెండు పేజీల అభినందన తీర్మానాన్ని ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here