ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఆమోదం

AP Cabinet Nod For Local Body Polls With 34% BC Reservation

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, జిల్లా పరిషత్‌ల సంఖ్య పెంపు తదితర అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను సకాలంలో పొందాలంటే పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది.

స్థానిక సంస్థల్లో బీసీలకు 34%శాతం రిజర్వేషన్లు

పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు రూరల్ ప్రాంతాల్లో 34%, అలాగే అర్బన్ ఏరియాల్లో 33⅓ శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994 ప్రకారం గ్రామీణ స్థానిక సంస్థల్లోనూ బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించింది.

అయితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.

బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేసి సిఫారసులు చేసేందుకు ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఉన్నతాధికారులు కేబినెట్‌కు వివరించారు.

మేయర్లు, చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు

పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో మేయర్లు, చైర్మన్లను ఇకపై నేరుగా ప్రజలే ఎన్నుకునే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

ఈ మార్పుతో పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

జిల్లా పరిషత్‌ల సంఖ్య 28కి పెంపు

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్‌ల సంఖ్యను 28కి పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా కొత్త జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణను చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను వేగంగా నిర్వహించడంతో పాటు బీసీ రిజర్వేషన్ల అమలు, ప్రత్యక్ష ఎన్నికల విధానం, జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర స్థానిక పాలనలో కీలక మార్పులకు దారితీయనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here