ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల సందడి మళ్లీ మొదలుకానుంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నంది చలనచిత్ర, టెలివిజన్ అవార్డులను నిర్వహించేందుకు ప్రభుత్వం G.O.Rt.No.1843 ద్వారా అధికారికంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం 2012 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డులతో పాటు 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాల నిర్వహణను పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
2012-2016 అవార్డుల ప్రదానోత్సవం
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 2012 నుంచి 2016 వరకు నంది, జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని 2026 నవంబర్‌లో విజయవాడలో నిర్వహించనున్నారు. అదే సమయంలో 2017-2024, 2025 సంవత్సరాలకు సంబంధించిన నంది అవార్డుల కోసం జ్యూరీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను సెప్టెంబర్ 2026లో పూర్తి చేసి, విజేతల జాబితాను నవంబర్‌లో అధికారికంగా ప్రకటించనున్నారు.
2017-2024కు ప్రత్యేక అవార్డు విధానం
2017 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరానికి పూర్తి స్థాయి నంది అవార్డులు కాకుండా పరిమిత కేటగిరీల్లో పురస్కారాలు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-
చలనచిత్ర విభాగంలో: ప్రతి ఏడాదికి ప్రథమ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ద్వితీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ మరియు రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులను ఇస్తారు.
-
టెలివిజన్ విభాగంలో: ప్రతి ఏడాదికి ప్రథమ, ద్వితీయ ఉత్తమ మెగా సీరియల్ మరియు రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
అమరావతి, తిరుపతి వేదికలుగా అవార్డుల పండుగ
2017-2024 మరియు 2025 సంవత్సరాలకు సంబంధించిన నంది ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని 2026 డిసెంబర్లో అమరావతి లేదా విజయవాడలో నిర్వహించనున్నారు. అలాగే నంది టీవీ అవార్డుల వేడుకను తిరుపతిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
నాటక పురస్కారాల పునరుద్ధరణ
సినీ, టీవీ రంగానికి చెందిన కళాకారులను ప్రోత్సహించేందుకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో పాటు 2025 నంది నాటక పురస్కారాలు, 2026 కందుకూరి పురస్కారాల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా, దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 20 వరకు గడువు నిర్ణయించారు. 2012 నుంచి నిలిచిపోయిన అవార్డుల ప్రక్రియను 2026 చివరి నాటికి పూర్తి చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.





































