భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త బృందాన్ని ఖరారు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దగ్గుబాటి పురందేశ్వరికి మరోసారి కీలక బాధ్యత దక్కింది. ఆమెతో పాటు మొత్తం 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీకి చోటు కల్పించారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సాల్, బిప్లవ్‌కుమార్ దేవ్, సతీశ్ పూనియా, గజేంద్ర పటేల్, హరీశ్ ద్వివేది, సంజయ్ భాటియా కూడా ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री नितिन नवीन द्वारा निम्नलिखित सदस्यों को भाजपा के राष्ट्रीय पदाधिकारी एवं अन्य दायित्वों पर नियुक्त किया जा रहा है। (2/2) pic.twitter.com/tqIWMkiMXP
— BJP (@BJP4India) August 17, 2026
సంస్థాగత బాధ్యతలు కొనసాగింపు
బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్ను కొనసాగించారు. జాతీయ సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా శివ్ ప్రకాశ్, సౌదన్ సింగ్‌లను నియమించారు.
పార్టీ జాతీయ కోశాధికారిగా పియూష్ గోయల్ను, సంయుక్త కోశాధికారిగా రాజేశ్ మంగళ్ను నియమించారు. జాతీయ కార్యదర్శుల విభాగంలో 16 మందికి అవకాశం కల్పించారు.
విష్ణువర్ధన్‌రెడ్డికి కీలక బాధ్యత
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డికి పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యత అప్పగించింది. అన్ని విభాగాల సంయుక్త సమన్వయకర్తగా ఆయనను నియమించింది.
పంజాబ్‌కు చెందిన తరుణ్ చుగ్ను బీజేపీ కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. సెంట్రల్ ఆఫీస్ కార్యదర్శిగా ఉత్తరాఖండ్‌కు చెందిన మహేంద్ర పాండే బాధ్యతలు చేపట్టనున్నారు.
ఓబీసీ మోర్చాకు కొత్త అధ్యక్షుడు
బీజేపీ ఓబీసీ మోర్చా నూతన అధ్యక్షుడిగా అమర్‌పాల్ మౌర్యను నియమించారు. సంస్థాగతంగా వివిధ విభాగాల పనితీరును మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేలా కొత్త కార్యవర్గంలో బాధ్యతలను కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణకు ప్రాతినిధ్యం లేకపోవడం చర్చనీయాంశం
కొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కలేదు. గతంలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణకు తాజా జాబితాలో చోటు కల్పించలేదు. దీంతో తెలంగాణ బీజేపీ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
కొత్త కార్యవర్గం ద్వారా దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, రానున్న రాజకీయ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే దిశగా బీజేపీ నాయకత్వం అడుగులు వేస్తోంది.






































