రూ.11085 కోట్లతో పల్లె పండుగ 3.0.. రేపు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

CM Chandrababu and Dy CM Pawan Kalyan To Launch Palle Panduga 3.0 in Udayagiri Tomorrow

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. సెప్టెంబర్ 29న నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం రామాపురం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.11,085 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ కార్యక్రమంలో గ్రామీణ రహదారులకు ప్రధాన ప్రాధాన్యం ఇచ్చారు. రూ.2,700 కోట్లతో 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, రూ.7,550 కోట్లతో 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. పాడి రైతులకు ఉపయోగపడేలా రూ.300 కోట్లతో 22 వేల మినీ గోకులాలను నిర్మించనున్నారు. అలాగే 50 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల విస్తరణకు రూ.225 కోట్లు కేటాయించారు. మరోవైపు 1,000 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్ల కోసం రూ.110 కోట్లు ఖర్చు చేయనున్నారు.

బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు, ఇతర స్థానిక మౌలిక సదుపాయాల కోసం మరో రూ.200 కోట్ల పనులు చేపట్టనున్నారు. మొత్తం ప్రణాళికలో కేంద్రం వాటా రూ.5,391 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.5,694 కోట్లను సమకూర్చనుంది. VB-G RAM G, గ్లోబల్ హార్టికల్చర్ హబ్, NABARD, SASKI తదితర నిధులను కూడా పనులకు వినియోగించనున్నారు.

ఇప్పటికే ‘పల్లె పండుగ 1.0’, ‘2.0’ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పశువుల షెడ్లు, పంట కుంటలు, సోక్‌పిట్లు, డ్రైనేజీ వంటి పనులు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. ‘పల్లె పండుగ 3.0’లో గ్రామీణ రవాణా, వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఉద్యాన రంగం, ప్రాథమిక సౌకర్యాలపై మరింత దృష్టి పెట్టనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here