3డీ కాంక్రీట్ ప్రింటింగ్‌తో పేదల ఇళ్లు.. దేశంలోనే తొలి పైలట్ ప్రాజెక్ట్ ఏపీలో ప్రారంభం

CM Chandrababu Launched India's First 3D Concrete Printed Housing Project Along With Union Minister Shivraj Singh Chouhan

నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా, చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల పీఎంఏవై (PMAY గ్రామీణ్-2.0) ఇళ్ల నిర్మాణానికి వైభవంగా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యాధునిక ‘3డీ కాంక్రీట్ ప్రింటింగ్’ పరిజ్ఞానంతో నిర్మించే పైలట్ ప్రాజెక్ట్‌కు భూమిపూజ నిర్వహించారు. ఈ నూతన సాంకేతికత ద్వారా కేవలం రూ. 5 లక్షల వ్యయంతో ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే పటిష్టమైన ఇళ్లను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు, ఇళ్ల పట్టాలను అందజేసి, వారిని సత్కరించారు.

సాధారణ కోటా కింద రాష్ట్రానికి మొదట 75 వేల ఇళ్లు మాత్రమే లభించగా, చంద్రబాబు నాయుడు చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ సంఖ్యను ఏకంగా 3 లక్షలకు పెంచిందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ప్రస్తుతం చేపట్టిన 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే మరో 3 లక్షలు, ఆ తదుపరి విడతలో మరో 3 లక్షలు చొప్పున మొత్తం 9 లక్షల ఇళ్లను మంజూరు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఏపీలో చేపడుతున్న ఈ వినూత్న 3డీ గృహ నిర్మాణం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని ప్రశంసించారు. 2029 నాటికి రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదే ఉండకూడదనే స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తున్నామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంతో పాటు, గ్రామాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మౌలిక వసతుల కల్పనకు బాటలు పడ్డాయి. స్వర్ణాంధ్ర ప్రదేశ్ నిర్మాణంలో భాగంగా అత్యాధునిక సాంకేతికతను పేదల సంక్షేమానికి జోడించి, గ్రామీణాభివృద్ధిలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here