విశాఖపట్నం వేదికగా ఘనంగా ప్రారంభమైన 31వ సీఐఐ (CII) అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. ‘కొత్త ప్రపంచ క్రమం: వాణిజ్యం, సాంకేతికత, నమ్మకం’ అనే ప్రధాన థీమ్‌తో జరుగుతున్న ఈ సదస్సులో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ మంత్రులు, నిపుణులను సీఎం సాదరంగా ఆహ్వానించారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ఈ వేదికగా ఆయన వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భాగస్వామ్య సదస్సులు కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, గ్లోబల్ మార్కెట్లతో అనుసంధానం కావడానికి, సరికొత్త సాంకేతిక భాగస్వామ్యాలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హబ్‌గా మారుస్తున్నామని తెలిపారు.
ముఖ్యంగా సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. రాష్ట్రంలో యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించేలా విద్యా, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు పేర్కొన్నారు.
పెట్టుబడిదారులు ఎదుర్కొనే బ్యూరోక్రసీ అడ్డంకులను పూర్తిగా తొలగిస్తూ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఎస్క్రో-అకౌంట్ విధానం ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎటువంటి జాప్యం లేకుండా అందిస్తున్నామని, త్వరలోనే దేశంలోనే తొలిసారిగా ‘ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్’ తీసుకురానున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నాన్ని గ్లోబల్ టెక్నాలజీ మరియు ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయాణంలో పారిశ్రామికవేత్తలందరూ భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.







































