విశాఖ సీఐఐ సదస్సు ద్వారా ఏపీకి మరో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు – సీఎం చంద్రబాబు

CM Chandrababu Says, Vizag CII Summit To Attract Rs.10 Lakh Cr Investments, Generating 10.77 Lakh Jobs For AP

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి మహర్దశ పడుతోందని, విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో మరో రూ. 10,50,970 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని యువతకు సుమారు 10,77,000 నూతన ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

మంగళవారం అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో మాట్లాడిన సీఎం, కేవలం రెండున్నరేళ్ల కూటమి పాలనలోనే రాష్ట్రానికి మొత్తం రూ. 31 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం చారిత్రాత్మక విజయమని, వీటి ద్వారా మొత్తంగా 25 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.

రాష్ట్రానికి ఒప్పందాల రూపంలో వచ్చిన ప్రతీ పెట్టుబడి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ (పనులు ప్రారంభించడం) అయ్యేలా చూడడంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని సీఎం తెలిపారు. పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రక్షణగా ‘ఎస్క్రో అకౌంట్’ (Escrow Account) విధానాన్ని తీసుకువచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని గర్వంగా ప్రకటించారు.

మరోవైపు, దేశంలోనే తొలి ‘క్వాంటమ్ కంప్యూటర్’ను రాజధాని అమరావతిలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న ప్రారంభించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించామని, ఆయన సమయం ఖరారైన వెంటనే ముహూర్తాన్ని అధికారికంగా ప్రకటిస్తామన్నారు.

ఇదే సమయంలో, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై కేబినెట్‌లో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ధరల భారం ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజలపై పడకూడదని, అవసరమైన అన్ని రకాల నిత్యావసరాలను రైతు బజార్లలో అందుబాటులో ఉంచాలని మంత్రులను ఆదేశించారు.

ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం గత 3 నెలల్లో రూ. 300 కోట్లు ఖర్చు చేసిందని, దక్షిణాదిలోనే తొలిసారిగా రైతు బజార్ల ద్వారా అందుబాటు ధరల్లో బియ్యాన్ని విక్రయిస్తున్న రాష్ట్రం ఏపీ అని గుర్తుచేశారు. ఇకపై జరిగే ప్రతీ కేబినెట్ భేటీలోనూ నిత్యావసర ధరల పెరుగుదల మరియు స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP)ని 15 శాతానికి పెంచడంపై ప్రత్యేక చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వ పనితీరుకు కేంద్రం విడుదల చేసిన ‘యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్’ గణాంకాలే నిదర్శనమని, దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలవడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. డ్వాక్రా, మెప్మా వ్యవస్థల పనితీరులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్‌గా నిలవడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని ఎవరూ తలకెక్కించుకోవద్దని, రాబోయే జనవరిలో సహకార సంఘాల ఎన్నికలకు సిద్ధం కావాలని కేబినెట్ సహచరులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here