రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం.. ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు గురువారం విజయవాడలోని పున్నమి ఘాట్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ‘జాతీయ సరస్ ఆజీవిక మేళా-2026’ వేదికగా మహిళా సాధికారతపై ఆయన కీలక ప్రసంగం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఈ జాతీయ మేళాను ప్రారంభించిన సీఎం, రాష్ట్రంలో గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) సభ్యులను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
ఢిల్లీ-ఎన్సిఆర్ దాటి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈ జాతీయ స్థాయి ప్రదర్శన జరగడం గర్వకారణమని పేర్కొన్నారు. తన ప్రసంగంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమైతేనే కుటుంబాలు, సమాజం వేగంగా పురోగమిస్తాయని అభిప్రాయపడ్డారు.
గ్రామీణ కళాకారులు మరియు మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ‘స్వయం ఏపీ’ (Swayam AP) బ్రాండ్ను వేదికగా మలుచుకుంటున్నట్లు ప్రకటించారు. డ్వాక్రా సంఘాల ప్రతిభను, వారి వ్యాపార అవకాశాలను మరింత విస్తరించడానికి డిజిటల్ మార్కెటింగ్ మరియు ఈ-కామర్స్ నెట్వర్క్లను అనుసంధానిస్తున్నట్లు సీఎం వివరించారు.
మహిళా శక్తి ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు జరిగేలా కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. బ్యాంకు లింకేజీ రుణాలు, రవాణా సౌకర్యాలు మరియు శిక్షణ కార్యక్రమాల ద్వారా మహిళా వ్యాపారవేత్తలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన 576 స్టాళ్లను, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా కళాకారుల ఉత్పత్తులను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం డ్వాక్రా మహిళలతో కలిసి ఆత్మీయ విందులో పాల్గొని వారి అనుభవాలు, సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులకు సరైన మద్దతు ధర, విస్తృత మార్కెట్ లభించేలా సెర్ప్ (SERP), మెప్మా (MEPMA) సంస్థలు అంకితభావంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.








































