ఆంధ్రప్రదేశ్‌ను వరుస తుఫాన్‌లు వణికిస్తున్నాయి. ఇటీవల సంభవించిన రెండు తుఫాన్‌ల ధాటికి ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో తుఫాన్ ఏపీపై విరుచుకుపడటానికి సిద్ధంగా ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం ఉదయానికి ఉత్తర వాయవ్యంగా పయనించి వాయుగుండంగా మారి ప్రస్తుతం తుఫాన్‌గా బలపడింది.
ఈ నెల 20వ తేదీనాటికి ఇది మరింత తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందనుండి. కళింగపట్నం-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. కాగా, దీనికి ఇరాన్ దేశం సూచించిన పేరు ‘అక్వాన్’గా నామకరణం చేశారు. ఈ తుపాను కారణంగా కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ నుంచి కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
సముద్రంలో ఏర్పడిన ఈ వాయుగుండం ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి శ్రీలంకలోని టింకోమలికి 620, అండమాన్ దీవుల్లోని శ్రీవిజయపురానికి 680, చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా 800, విశాఖపట్ానానికి దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా ఉత్తర వాయవ్యంగా పయనిస్తూ సోమవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారుతుందని, మంగళవారానికి మరింత బలపడి తీవ్ర తుపాను రూపు సంతరించుకుంటుందని వాతావరణ నిపుణులు వివరించారు.
ఈ తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో గంటకు 100 నుంచి 130 కి.మీ., అప్పుడప్పుడు 145 కి.మీ. వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా నవంబర్ 18 నుంచి కోస్తా జిల్లాల్లో వర్షాలు ప్రారంభమై, 19, 20 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో కుంభవృష్టి (Torrential Rains) కురిసే ప్రమాదం ఉంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీరం వెంబడి గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, లోతట్టు ప్రాంతాల్లోకి సముద్ర అలలు చొచ్చుకొచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.
తీవ్ర తుపాను ముప్పు నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ ఈ నెల 21వ తేదీ వరకు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. తీర ప్రాంతాల్లోని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచికను ఎగురవేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. తుపాను గమనాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, జిల్లాల యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.


































