ఏపీపై అర్నబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం.. కేంద్రం సాయం కోరిన సీఎం చంద్రబాబు

Cyclone Arnab CM Chandrababu Writes Letter Union Home Minister Amit Shah To Seek Central Assistance

ఆంధ్రప్రదేశ్‌లో ‘అర్నబ్’ తీవ్ర తుఫాను ప్రభావంతో జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రంలో చేపట్టిన సహాయక చర్యలు, ప్రాథమిక నష్టం అంచనాలను వివరించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని త్వరగా పంపించాలని కోరారు. అవసరమైన మేరకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), ఇతర కేంద్ర సంస్థల సహకారాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

14 జిల్లాల్లో సహాయక చర్యలు

తుఫాను నేపథ్యంలో 14 జిల్లాల్లో 16 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 11 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలను రంగంలోకి దించినట్లు చంద్రబాబు తెలిపారు. 28 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదని వెల్లడించారు.

పంటలు, ఇళ్లకు తీవ్ర నష్టం

తుఫాను కారణంగా సుమారు 180 ఇళ్లు దెబ్బతిన్నాయని, వీటిలో ఎక్కువ భాగం కోనసీమ జిల్లాలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట, 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలు ముంపు లేదా ఇతర నష్టానికి గురైనట్లు తెలిపారు. మొత్తంగా 81,350 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 220కు పైగా చెట్లు నేలకూలగా, వాటిలో 170కిపైగా చెట్లను తొలగించి రహదారులను పునరుద్ధరించినట్లు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు.

కేంద్ర సహకారం కోరిన సీఎం

విద్యుత్, తాగునీటి సరఫరా పునరుద్ధరణ, రహదారులపై అడ్డంకుల తొలగింపు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్య చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. నష్టం అంచనాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని కొనసాగించడంతోపాటు, నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని ముందుగానే పంపించాలని అమిత్ షాను కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here