పల్లె పండుగ 3.0తో గ్రామాల రూపురేఖలు మారతాయి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Dy CM Pawan Kalyan Says, Palle Panduga 3.0 Will Transform Rural Andhra Pradesh

పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన రూ.11,085 కోట్ల నిధులతో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు అవసరమైన స్థాయిలో నిధులు అందలేదని విమర్శించిన పవన్,  పల్లె పండుగతో పాటు జల్‌జీవన్ మిషన్ ద్వారా పలు అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లామని తెలిపారు.

చంద్రబాబు సహకారంతో పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేసి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మినీ గోకులాలు, ఫామ్ పాండ్స్ వంటి పనులు చేపట్టామని, మారుమూల తండాలకు సైతం రహదారి సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు.

అమరజీవి జలధార ద్వారా పలు ప్రాంతాలకు తాగునీటిని అందిస్తున్నామని, 161 గ్రామీణ నియోజకవర్గాల్లో డొంక రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని పవన్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో పల్లె పండుగ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి పునాది అని అన్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వలసలు పెరిగాయని పేర్కొంటూ, ప్రస్తుతం గ్రామాల రూపురేఖలు మార్చే దిశగా చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనకు ప్రస్తుత కార్యక్రమాలు దోహదపడతాయని మాధవ్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here