కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. పార్టీ పేరు ఏంటంటే?

Former MP Vijayasai Reddy Launches New Political Party Named Parivarthana Rajaneeti Party

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) పేరుతో ఈ కొత్త ప్రాంతీయ పార్టీని ఆవిర్భవింపజేశారు. తిరుపతిలో దేవతల సాక్షిగా ధర్మ సంస్థాపన కోసమే ఈ పార్టీని ప్రారంభించినట్లు ఆయన స్పష్టం చేశారు.

పార్టీ జెండాను తెలుపు, కాషాయం రంగుల కలయికతో రూపొందించి, దాని మధ్యలో ‘ధర్మచక్రం’ గుర్తును పొందుపరిచారు. పార్టీ ఆవిర్భావ వేదికపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీ భవిష్యత్తు ఏ ఒక్క నాయకుడి చేతిలోనూ లేదని, ఐదు కోట్ల ఆంధ్రుల చేతుల్లోనే ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి మరియు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ రెంటిపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.

“అధికార, ప్రతిపక్షాలు రెండూ తీవ్రంగా తప్పు చేస్తున్నాయి. వారి ఆత్మప్రశంసలు, రాజకీయం హోరులో నిజాలు, లెక్కలు, ప్రజల ప్రాథమిక అవసరాలు కనుమరుగవుతున్నాయి. పాలకులు తప్పు చేసినప్పుడు నిలదీసి ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడంతోనే బాధ్యత ముగిసిపోదు” అని పిలుపునిచ్చారు.

రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న కుటుంబ పాలనపై విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఐదు కోట్ల మంది ఏపీ ప్రజల భవిష్యత్తును కేవలం రెండు కుటుంబాలే శాసించడం ఏంటని ప్రశ్నించారు. “వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలి. తండ్రి సీఎం అయితే కుమారుడే సీఎం కావాలా? ప్రతి కులంలోనూ, ప్రతి సామాజిక వర్గంలోనూ సమర్థవంతమైన నాయకులున్నారు. యువతలోని నాయకత్వ లక్షణాలను వెలికితీసి, వారిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయడమే ‘పీఆర్పీ’ ప్రధాన లక్ష్యం” అని ఉద్ఘాటించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో తాను క్రియాశీలకంగా పనిచేశానని గుర్తుచేస్తూ.. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. వైకాపా నుంచి వచ్చే వారికి తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 కి 175 నియోజకవర్గాల్లో పరివర్తన రాజనీతి పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిన అంశంపై తెలంగాణ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు ఖాయమని, దుష్ట పరిపాలనకు స్వస్తి పలుకుతామని ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here