విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైన 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రసంగం పారిశ్రామిక వర్గాలను ఎంతగానో ఆకట్టుకుంది. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను ఆయన అంతర్జాతీయ ప్రతినిధుల ముందు వివరించారు.
కేవలం వ్యాపార వాతావరణమే కాకుండా, పారిశ్రామికవేత్తలకు పూర్తి భద్రత మరియు సౌలభ్యాన్ని కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి లోకేష్, 2024 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి సుమారు రూ. 22.6 లక్ష కోట్ల పెట్టుబడి ఒప్పందాలు వచ్చాయని, అందులో ఇప్పటికే 73 శాతం ప్రాజెక్టులకు అన్ని రకాల నియంత్రణ అనుమతులు కూడా మంజూరైనట్లు వెల్లడించారు.
విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్ భారతదేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐ (FDI) ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ప్రీమియర్ ఎనర్జీస్ వంటి దిగ్గజ సంస్థల ద్వారా భారీ ఎత్తున తయారీ రంగాలు రాష్ట్రంలో ఏర్పాటవుతున్నాయని పేర్కొన్నారు.
పరిశ్రమల స్థాపనలో బ్యూరోక్రసీ అడ్డంకులను పూర్తిగా తొలగిస్తూ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని అనుసరిస్తున్నామని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు ఎస్క్రో-బ్యాక్డ్ పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించడంతో పాటు, దేశంలోనే తొలిసారిగా ‘ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్’ను తీసుకువస్తున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుందని ప్రకటించారు.
కేవలం తయారీ యూనిట్ల ఏర్పాటుకే పరిమితం కాకుండా, అత్యుత్తమ జీవన ప్రమాణాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సరికొత్త పోర్టులు మరియు భోగపురి అంతర్జాతీయ విమానాశ్రయ సౌకర్యాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు తమ ప్రధాన కార్పొరేట్ కార్యాలయాలను కూడా తరలించాలని పారిశ్రామిక దిగ్గజాలకు లోకేష్ పిలుపునిచ్చారు.
ఇక, ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక వస్త్రధారణలో హాజరై సందడి చేశారు. సాంప్రదాయ దుస్తులలో మెరిసిన ఆయన సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనిపై ఈ రోజు నేను మన నేత కార్మికుల గర్వానికి చిహ్నమైన చేనేత జాకెట్‌ను ధరించాను. ఆంధ్ర హస్తకళా సంప్రదాయాలను సజీవంగా ఉంచుతున్న చేతులకు మద్దతు ఇవ్వడం గర్వంగా ఉంది. ఇది ఏ కళకు ప్రాతినిధ్యం వహిస్తుందో ఊహించగలరా? అంటూ అంతకుముందు మంత్రి లోకేష్ తన ఎక్స్ లో పేర్కొన్నారు.








































