మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్

Minister Nara Lokesh Distributes Permanent House Site Pattas To Beneficiaries in Mangalagiri Constituency

మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ దాదాపు 80 శాతం పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు శాశ్వత హక్కులు కల్పించే చర్యల్లో భాగంగా సోమవారం తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ‘మన ఇల్లు – మన లోకేష్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 372 మంది లబ్ధిదారులకు మంత్రి ఇళ్ల పట్టాలను అందజేశారు.

మంగళగిరిలో ఇప్పటివరకు 5,636 మందికి పట్టాలు పంపిణీ చేసినట్లు లోకేష్ వెల్లడించారు. తొలి దశలో 3,002 మందికి, రెండో విడతలో 2,634 మందికి పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఈ రెండు దశల్లో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన భూములను పేదలకు ఉచితంగా శాశ్వత హక్కులతో అందించినట్లు మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

అటవీ, ఇరిగేషన్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన భూముల సమస్యలను వివిధ శాఖల సమన్వయంతో పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ భూములకు సంబంధించిన సమస్యలపై కూడా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.

తాను 2019లో మంగళగిరిలో ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యే ఉంటూ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టానని మంత్రి లోకేష్ అన్నారు. పట్టాల సమస్యను పరిష్కరిస్తానన్న ఎన్నికల హామీ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

త్వరలో విజయవాడలో 24 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి పనులను పూర్తి చేయడంతో పాటు 2029 నాటికి గ్యాస్, తాగునీరు, భూగర్భ డ్రైనేజీ సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిడమర్రు పాఠశాలను అభివృద్ధి చేసిన తరహాలో నియోజకవర్గంలోని ఇతర పాఠశాలలను కూడా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here