విశాఖ, తిరుపతిలలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ – నటుడు రానాతో పాడ్‌కాస్ట్‌లో మంత్రి లోకేష్

Minister Nara Lokesh Unveils AP's Vision in Special Podcast With Actor Rana Daggubati

ఆంధ్రప్రదేశ్‌ను క్రియేటర్ ఎకానమీ (Creator Economy) మరియు సినీ రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటితో నిర్వహించిన ప్రత్యేక లైవ్ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సినిమా, యూట్యూబ్, యానిమేషన్, గేమింగ్ రంగాలు భవిష్యత్తులో అతిపెద్ద ఉపాధి అవకాశాలుగా మారనున్నాయని, ఔత్సాహికుల సృజనాత్మక ఆలోచనలకు రూపమివ్వడమే ‘బ్రాండ్ ఆంధ్ర’ ప్రత్యేకతని ఆయన పేర్కొన్నారు. వినోద రంగంలో యువతకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నం మరియు తిరుపతిలలో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ (Center of Excellence) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు లోకేష్ ప్రకటించారు.

సంగీత దర్శకులు థమన్ వంటి అనుభవజ్ఞులతో కలిసి యువతకు శిక్షణ ఇస్తామని, ఏఐ (AI) సాంకేతికతను అందిపుచ్చుకుని కొత్త అవకాశాలు సృష్టిస్తామని తెలిపారు. అలాగే రాజకీయాల్లోకి యువత రావాలని పిలుపునిస్తూ, ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో విశాఖ సహా పలు చోట్ల యువత మేయర్లు, ఛైర్‌పర్సన్లుగా గెలిచారని, ప్రస్తుత మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది యువతే ఉన్నారని గుర్తుచేశారు.

రాష్ట్ర అభివృద్ధి రోడ్‌మ్యాప్ గురించి వివరిస్తూ.. అమరావతిలో దేశంలోనే తొలి 156 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయబోతున్నామని, విశాఖను దేశ ఆర్థిక శక్తి కేంద్రంగా మారుస్తామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ ప్రగతికి గేట్‌వే లాంటిదని, ఇది హైదరాబాద్ విమానాశ్రయం కంటే పెద్దదిగా ఎదిగిన రోజే తనకు నిజమైన సంతృప్తి కలుగుతుందని చెప్పారు. విశాఖలో ప్రస్తుతం 17 స్టార్ హోటళ్లు నిర్మాణంలో ఉన్నాయని, అరకు లోయలో మారథాన్ నిర్వహణకు మహీంద్రా సంస్థతో చర్చిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా విశాఖలో సినీ పరిశ్రమ వృద్ధికి బాధ్యత తీసుకోవాలని లోకేష్ కోరగా, నటుడు రానా దగ్గుబాటి సానుకూలంగా స్పందిస్తూ సోమవారం ఉదయానికల్లా పూర్తి బ్లూప్రింట్ సిద్ధం చేస్తానని హామీ ఇచ్చారు. దీనికి లోకేష్ స్పందిస్తూ ఇదే ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అని కొనియాడారు. వచ్చే ఏడాదిలో విశాఖపట్నంలోనే తమ సంస్థ తరఫున సినీ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభిస్తామని రానా ప్రకటించడంతో, ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ విశాఖ సరికొత్త వినోద, పారిశ్రామిక కేంద్రంగా ఎదగబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here