ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో కీలక ఘట్టంగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (అల్లూరి సీతారామ రాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. సుమారు రూ.4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపునివ్వనుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
టెర్మినల్‌లో ప్రత్యేక ఆకర్షణగా భారీ వీడియో వాల్
విమానాశ్రయ టెర్మినల్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక భారీ వీడియో వాల్‌ను ప్రధాని మోదీ పరిశీలించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వం, ఉత్తరాంధ్ర చారిత్రక విశేషాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాల దృశ్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వాటి విశిష్టతను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి వివరించారు.
అలాగే టెర్మినల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళాకృతులు, శిల్పాలను కూడా ప్రధాని ఆసక్తిగా వీక్షించారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జీఎంఆర్ ప్రతినిధులతో కలిసి స్మారక చిత్రాన్ని దిగారు.
గిరిజన సంస్కృతికి ప్రతీకగా థింసా నృత్య ప్రదర్శన
విమానాశ్రయం నుంచి సభా వేదిక వరకు ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణించిన ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌కు వేలాది మంది గిరిజన మహిళలు థింసా నృత్యంతో ఘన స్వాగతం పలికారు. సుమారు 13,500 మంది గిరిజన మహిళలు పాల్గొన్న ఈ ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బొబ్బిలి వీణతో ప్రధానికి సత్కారం
బహిరంగ సభా వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర కళా వైభవానికి ప్రతీకగా నిలిచే బొబ్బిలి వీణను బహూకరించారు. అనంతరం పొందూరు ఖాదీ కండువాతో ఘనంగా సత్కరించారు.
ఘన స్వాగతంతో ప్రారంభమైన పర్యటన
అంతకుముందు ప్రత్యేక విమానంలో భోగాపురం చేరుకున్న ప్రధాని మోదీకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని విమానాశ్రయాన్ని దేశానికి అంకితం చేశారు.






































