ఏపీ పరిషత్ పోరు.. చంద్రగిరిలో పోలింగ్ బూత్ వద్ద ఆసక్తికర సన్నివేశం

TDP Leader Pulivarthi Sudha Reddy and Ex Minister Chevireddy Face Off Near Polling Booth in Chandragiri

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి, టీడీపీ నాయకురాలు పులివర్తి సుధారెడ్డి ఎదురుపడటంతో పోలింగ్ కేంద్రం వద్ద వాతావరణం ఒక్కసారిగా ఉత్కంఠకు దారితీసింది.

కాగా, పోలింగ్ జరుగుతున్న కేంద్రాల వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. ఈ క్రమంలో క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన పులివర్తి సుధారెడ్డి అప్పటికే అక్కడ ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరకు నేరుగా వెళ్లారు. “అన్నా.. ప్రజలను ప్రశాంతంగా ఓటు వేయనివ్వండి. అనవసర వివాదాలు వద్దు. కావాలంటే ఇద్దరం కలిసే వెళ్లి పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులు చూద్దాం.. ఈ రోజంతా మీరు ఎటు వెళ్తే నేను అటే వస్తా.. అవసరమైతే నా కారులోనే కలిసి తిరుగుదాం” అంటూ ఆఫర్ ఇవ్వడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.

అయితే, సుధారెడ్డి నుండి ఊహించని ఈ వ్యాఖ్యలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఆయన మౌనంగా అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఆమె ఈ సందర్భంగా వైసీపీ నేతలకు స్పష్టం చేశారు.

కాగా, గత శాసనసభ ఎన్నికల సమయంలోనూ చంద్రగిరిలో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో, తాజా పరిణామం నియోజకవర్గ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ వార్త స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

పోలింగ్ సమయంలో భౌతిక ఘర్షణలు, అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా రక్షణ చర్యలు చేపట్టాలని ఎన్నికల అధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక బూత్‌ల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించి ప్రశాంతంగా పోలింగ్ పూర్తయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here