ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరియు పోలీసు అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో రెండేళ్లలో తాను మళ్లీ అధికారంలోకి వస్తానని, ఆ సమయంలో చట్టప్రకారం తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటానని తీవ్ర హెచ్చరికలు జేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వంలో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడిందని జగన్ ఆరోపించారు.
సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠా, డీజీపీ హరీశ్ గుప్తా, వివిధ జిల్లాల డీఐజీలు, కలెక్టర్లు అందరూ కుమ్మక్కై రాక్షసుల్లా వ్యవహరించారని మండిపడ్డారు. నామినేషన్ పత్రాలను చించేయడం, మహిళల పట్ల టీడీపీ నేతలు అనుచితంగా ప్రవర్తించడం వంటి ఘటనలను చూస్తుంటే ఇది ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ కాదని, ‘అరాచక ఆంధ్రప్రదేశ్’ అని విమర్శించారు.
తాము అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుకు వీరాభిమాని అయిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎస్‌ఈసీగా ఉన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా 86 శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించామని జగన్ గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
“ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎస్‌ఈసీ పునేఠా, డీజీపీ, కలెక్టర్లు.. తప్పు చేసిన ప్రతిఒక్కరినీ సంఘటనల వారీగా ఆధారాలతో సహా గుర్తుంచుకుని పేరుపేరునా చట్టప్రకారం తాటతీస్తా” అని హెచ్చరించారు. ఈ సమావేశంలో ‘పచ్చమూకల దాడి’ పేరిట రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
కూటమి నేతలే వైయస్సార్‌సీపీ అభ్యర్థులుగా డమ్మీ నామినేషన్లు వేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన జగన్, ఈ అంశంపై ఈ నెల 25న సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం సమయం చంద్రబాబుది కావచ్చని, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, తాము అధికారంలోకి వచ్చాక చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలంతా తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు.






































