ఉత్తరప్రదేశ్లోని అయోధ్య శ్రీరామ జన్మభూమి క్షేత్రంలో శ్రీరామ్ లల్లా దర్శనం మరియు ఆరతి సమయాలను నవంబర్ 1వ తేదీ నుంచి మార్చనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ప్రస్తుతం ఆలయం ఉదయం 3:45 గంటలకు తెరుచుకుని, రాత్రి 10:30 గంటలకు మూసివేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, మారుతున్న శీతాకాల పరిస్థితులు మరియు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త వేళల ప్రకారం రోజూ ఉదయం 4:00 గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకోనుండగా.. రాత్రి 10:00 గంటలకు శయన ఆరతి అనంతరం మందిరాన్ని మూసివేయనున్నారు.
కొత్తగా నిర్ణయించిన శీతాకాలపు సమయాల ప్రకారం.. ప్రతిరోజూ ఉదయం 4:30 గంటల నుంచి 4:40 గంటల వరకు మంగళ ఆరతి నిర్వహిస్తారు. గతంలో ఇది ఉదయం 4:00 గంటలకు జరిగేది. ఆ తర్వాత భక్తులకు సాధారణ దర్శనాలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 4:00 గంటల నుంచి 4:10 గంటల వరకు స్వల్ప సమయం ఆలయ ద్వారాలను మూసివేస్తారు. అనంతరం సాయంత్రం 6:45 గంటల వరకు దర్శనాలు పునఃప్రారంభమవుతాయి.
సాయంత్రం 7:00 గంటలకు సంధ్యా ఆరతి కార్యక్రమం నిర్వహించనుండగా, అనంతరం రాత్రి 8:00 గంటల వరకు భక్తులకు రామయ్య దర్శనం లభిస్తుంది. తిరిగి రాత్రి 8:30 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఇస్తారు. రాత్రి 10:00 గంటలకు శయన ఆరతి ముగిసిన వెంటనే ఆలయ ద్వారాలను మూసివేస్తారు. భక్తులు ఈ నూతన దర్శన సమయాలను గమనించి, దానికి అనుగుణంగా తమ అయోధ్య యాత్రను ప్లాన్ చేసుకోవాలని ఆలయ ప్రాంగణ అధికారులు సూచించారు.
రామ్ మందిర్ నిర్వాహక ట్రస్ట్ భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు శీతాకాలంలో శ్రీరామ్ లల్లా పూజాధికాలను నిరంతరాయంగా నిర్వహించేందుకు ఈ మార్పులు చేపట్టింది. భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన పాస్లు మరియు సమయ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నట్లు ఆలయ ప్రధాన పూజారి వెల్లడించారు.






































