కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ మరియు అగ్రనేత సోనియా గాంధీ రాసిన ప్రతిష్టాత్మక ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) అధికారికంగా విడుదలయింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ వేడుకకు రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఇటలీలో సాధారణ కుటుంబంలో జన్మించిన ఆమె.. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని వివాహం చేసుకుని భారత్‌కు కోడలుగా రావడం, ఆ తర్వాత దేశ రాజకీయాల్లో అత్యున్నత నాయకురాలిగా ఎదిగే క్రమంలో ఎదురైన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ఈ ఆత్మకథలో సోనియా గాంధీ తన జీవితంలోని అనేక ఆసక్తికరమైన విషయాలను, భావోద్వేగ క్షణాలను పాఠకులతో పంచుకున్నారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీతో తన అనుబంధం, రాజీవ్ గాంధీ అకస్మాత్ మరణం తర్వాత కుటుంబం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు, రాజకీయాల్లోకి రావాల్సిన వచ్చిన వాతావరణం వంటి కీలక ఘట్టాలను ఈ పుస్తకం ద్వారా వెల్లడించారు.
ముఖ్యంగా ఒక విదేశీ మహిళగా భారతదేశ సంస్కృతిలో లీనమై, ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలను ఎలా పొందారన్న అంశం ఈ పుస్తకంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పుస్తకం విడుదలైన అతి తక్కువ సమయంలోనే విశేష స్పందన లభించిందని, ఇప్పటికే లక్షకు పైగా కాపీలు అమ్ముడై సాహితీ లోకంలో సంచలనం సృష్టిస్తోందని ప్రచురణకర్తలు తెలిపారు.
దేశ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన నాయకురాలిగా గుర్తింపు పొందిన సోనియా గాంధీ స్వయంగా తన కలంతో రాసిన ఈ జ్ఞాపకాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ శ్రేణులు ఈ పుస్తకావిష్కరణను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
ఇక ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల నుండి నేకమంది ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, జోసెఫ్ విజయ్ తదితరులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఈ వేడుకలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
భారతదేశ రాజకీయ ప్రయాణంలో ఒక కీలక శకానికి సంబంధించిన అంతర్గత విషయాలు ఈ ఆత్మకథ ద్వారా వెలుగులోకి వచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భాషల్లోకి ఈ పుస్తకం త్వరలోనే అనువాదమై పాఠకులకు అందుబాటులోకి రానుంది.



































