ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను తక్షణమే ఆపాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) కీలక తీర్పునిచ్చింది. మొత్తం 15 మంది న్యాయమూర్తులు కలిగిన కోర్టు 13-2 తేడాతో తీర్పుని ప్రకటించింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక సభ్యుడిగా ఉన్న భారత న్యాయమూర్తి దల్వీర్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. 13 మంది న్యాయమూర్తులు రష్యా సైనిక చర్యకు వ్యతిరేకించగా కేవలం ఇద్దరు న్యాయమూర్తులు రష్యా చర్యను సమర్ధిస్తూ ఓటేశారు. ఆ ఇద్దరిలో ఒకరు రష్యా దేశానికి చెందినవారు కాగా, మరొకరు చైనా దేశానికీ చెందిన న్యాయమూర్తి కావటం విశేషం. అయితే అంతర్జాతీయ స్థాయిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేయడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు పలు సార్లు ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటింగ్‌కు భారత్ దూరంగా తటస్థ వైఖరి తీసుకుంది.
యుఎన్ చార్టర్ ప్రకారం వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కోర్టు తన తీర్పులో, యుద్ధ చట్టాలతో సహా అంతర్జాతీయ చట్టం ప్రకారం దేశాలు తమ బాధ్యతలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. అలాగే క్రెమ్లిన్ చర్యల ఫలితంగా సంభవించిన అనేక పౌర మరణాలు మరియు భవనాలు, మౌలిక సదుపాయాల ధ్వంసంతో సహా గణనీయమైన భౌతిక నష్టం గురించి కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో తుది నిర్ణయం పెండింగ్‌లో ఉన్న రష్యన్ ఫెడరేషన్, ఫిబ్రవరి 24, 2022 న ఉక్రెయిన్ భూభాగంలో ప్రారంభించిన సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలి అని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క తీర్పులకు సాధారణంగా దేశాలు కట్టుబడి ఉంటాయి, అయితే ఐసీజే తన ఆదేశాలను అమలు చేయడానికి ప్రత్యక్ష మార్గాలు లేనందున దేశాలు వాటిని విస్మరించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అంతర్జాతీయ న్యాయస్థానంలో 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీరిలో.. ఐసీజే అధ్యక్షుడు, జడ్జి జోన్ ఇ డోనోగ్యు (అమెరికా), జడ్జి పీటర్ టోమ్కా (స్లోవేకియా), జడ్జి రోనీ అబ్రహం (ఫ్రాన్స్), జడ్జి మొహమ్మద్ బెన్నౌనా (మొరాకో), జడ్జి అబ్దుల్కావి అహ్మద్ యూసుఫ్ (సోమాలియా), జడ్జి జూలియా సెబుటిండే (ఉగాండా), జడ్జి దల్వీర్ భండారీ (భారతదేశం), జడ్జి పాట్రిక్ లిప్టన్ రాబిన్సన్ (జమైకా), న్యాయమూర్తి నవాఫ్ సలామ్ (లెబనాన్), జడ్జి ఇవాసావా యుజి (జపాన్), జడ్జి జార్జ్ నోల్టే (జర్మనీ), జడ్జి హిల్లరీ చార్లెస్‌వర్త్ (ఆస్ట్రేలియా) అనుకూలంగా ఓటు వేశారు. వ్యతిరేకంగా ఓటు వేసిన ఇద్దరిలో వైస్ ప్రెసిడెంట్ కిరిల్ గెవోర్జియన్ (రష్యా) మరియు జడ్జి జు హాన్కిన్ (చైనా) ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ