ఫ్లై దుబాయ్ విమానంలో హైడ్రామా.. 174 మంది ప్రాణాలను కాపాడిన ఇండియన్ పైలట్

Indian Pilot Smit Machchhar Saves 174 Passengers on FlyDubai Flight Incident

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ‘ఫ్లై దుబాయ్’ (FlyDubai) విమానంలో ఆకాశంలోనే అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ఈ విమానం 174 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తుండగా, కోపైలట్‌ ఒక్కసారిగా కెప్టెన్‌పై దాడి చేశాడు. ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్, విమానాన్ని కూల్చివేసే ఉద్దేశంతో భారత కెప్టెన్ పైలట్ స్మిత్ మచ్చర్ పైన కత్తితో హఠాత్తుగా దాడికి దిగాడు. ఈ ఘటనలో విమానం ఒక్కసారిగా వేల అడుగుల ఎత్తు కోల్పోయింది. 

కాక్‌‌పిట్‌లో రక్తం.. 29 సెకన్లలో 14 వేల అడుగుల డైవ్

దాడి సమయంలో తీవ్రంగా గాయపడి రక్తసిక్తమైనప్పటికీ, భారతీయ పైలట్ మచ్చర్ అత్యంత సాహసంతో పోరాడారు. కో-పైలట్ కంట్రోల్స్ లాక్కోవడానికి ప్రయత్నించడంతో విమానం కేవలం 29 సెకన్ల వ్యవధిలోనే ఏకంగా 14,000 అడుగుల కిందకు జారిపోయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ మచ్చార్ కాక్‌పిట్ తలుపులు తెరవడంతో పాటు ఎమర్జెన్సీ, హైజాక్ కోడ్‌లను డిస్ట్రెస్ సిగ్నల్స్ ద్వారా పంపించారు.

ప్రయాణికుల వీరోచిత పోరాటం

కాక్‌పిట్‌లోంచి అరుపులు, కేకలు విన్న విమాన సిబ్బంది మరియు ప్రయాణికులు తక్షణమే రంగంలోకి దిగారు. కాక్‌పిట్‌లోకి చొచ్చుకెళ్లి దాడికి దిగిన కో-పైలట్‌ను సకాలంలో అడ్డుకుని గట్టిగా బంధించారు.

  • ప్రయాణికుల వివరాలు: ఘటన సమయంలో విమానంలో మొత్తం 174 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 166 మంది ఇజ్రాయెల్ జాతీయులు ఉన్నారు.

  • ల్యాండింగ్ సహాయం: అదృష్టవశాత్తూ ప్రయాణికుల్లో ఉన్న ఇద్దరు ఇతర విమాన పైలట్లు ముందుకొచ్చి, తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్‌కు సాయంగా నిలిచారు.

సౌదీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ – సురక్షితంగా ఇజ్రాయెల్‌కు

పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన అనంతరం విమానాన్ని అత్యవసరంగా సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా దింపారు. గాయపడిన పైలట్ మచ్చర్‌ను ప్రాణాపాయం నుంచి రక్షించి చికిత్స అందించారు. ఆ తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా ఇజ్రాయెల్ చేర్చారు. భారతీయ పైలట్ మచ్చార్ మరియు ప్రయాణికుల సాహసాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రత్యేకంగా కొనియాడారు.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఇజ్రాయెల్

కాగా, ఈ ఘటనపై ఇజ్రాయెల్ సమగ్ర విచారణకు ఆదేశించింది. గత కొన్ని నెలలుగా ఇరాన్ దేశంతో కొనసాగుతున్న యుద్ధ ఘర్షణల నేపథ్యంలో ఇజ్రాయెల్ దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here