ఐపీఎల్‌లో బిగ్ ట్రేడ్ ధమాకా: పంజాబ్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబయికి అర్ష్‌దీప్ సింగ్

IPL Trade Hardik Pandya Moves to Punjab Kings, Arshdeep Singh Joins Mumbai Indians

ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) 2027 సీజన్‌కు ముందు ఫ్రాంచైజీల మధ్య ఊహించని రీతిలో ఒక భారీ ‘ప్లేయర్ ట్రేడ్ డీల్’ అధికారికంగా పూర్తయింది. క్రికెట్ వర్గాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న ప్రచారానికి తెర దించుతూ, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు మారగా, విధ్వంసకర ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబయి ఇండియన్స్ గూటికి చేరారు.

ఈ మెగా ట్రేడ్‌ను ఐపీఎల్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించడంతో ఇరు ఫ్రాంచైజీలు సోషల్ మీడియా వేదికగా స్పందించాయి. ముంబయి ఇండియన్స్ జట్టు సుదీర్ఘకాలం పాటు తమతో ఉన్న హార్దిక్ పాండ్యాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగపూరిత వీడ్కోలు పలికింది.

“ఎత్తుపల్లాలతో కూడిన ఈ ప్రయాణంలో.. అన్ని దశల్లోనూ ముంబయి ఇండియన్స్ కథలో నువ్వు భాగమయ్యావు. థాంక్యూ హార్దిక్” అని ప్రత్యేక వీడియోను పంచుకుంది. అదే సమయంలో తమ జట్టులోకి కొత్తగా వచ్చిన ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్‌కు ఘన స్వాగతం పలికింది. “అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్.. ఇకపై ముంబైకర్” అంటూ ఆనందం వ్యక్తం చేసింది.

అటు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా తమ స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి లోనైంది. “2019లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన చిన్ననాటి యువ ఆటగాడి నుంచి పంజాబ్ గర్వించే స్థాయికి ఎదిగావు. ఈ జట్టుకు ఎన్నో మరపురాని జ్ఞాపకాలను అందించావు. థాంక్యూ అర్ష్ పాజీ! నువ్వు ఎప్పటికీ మా వాడివే” అంటూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ రాసుకొచ్చింది.

ఇక ఈ ఐపీఎల్ ట్రేడ్ డీల్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా ఫీజు పెరిగింది. ముంబయి ఇండియన్స్ అతడికి ఇంతకుముందు రూ.16.35 కోట్లు ఇస్తుండగా.. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌ పాండ్యాకు రూ.18 కోట్లు ఆఫర్ చేసింది. అలాగే మరోవైపు పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన అర్ష్‌దీప్ సింగ్ ఎలాంటి మార్పు లేకుండా.. (రూ.18 కోట్ల తన అదే ఫీజుతో) ముంబయి ఇండియన్స్ జట్టులోకి చేరాడు.

ఈ చారిత్రాత్మక మార్పిడితో రాబోయే ఐపీఎల్ సీజన్లలో ఇరు జట్ల సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. పంజాబ్ కింగ్స్ జట్టు హార్దిక్ పాండ్యా రాకతో బలమైన ఆల్ రౌండర్ మరియు అనుభవజ్ఞుడైన నాయకుడిని పొందగా, ముంబయి ఇండియన్స్ అర్ష్‌దీప్ సింగ్ చేరికతో తమ పేస్ బౌలింగ్ విభాగమైన డెత్ ఓవర్ల బలాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ బిగ్ ట్రేడ్ డీల్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here