దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో (IITs) ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2027 (JEE Advanced 2027) పరీక్ష తేదీ ఖరారైంది. ఈ పరీక్షను 2027 మే 23వ తేదీ (ఆదివారం) నాడు నిర్వహించనున్నట్లు నిర్వాహక సంస్థ ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను (jeeadv.ac.in) ప్రారంభించడంతో పాటు, పరీక్షకు అర్హత నిబంధనలను కూడా అందుబాటులో ఉంచింది.
ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో విద్యార్థుల సౌకర్యార్థం ఐఐటీ ఢిల్లీ ఒక కీలక మార్పును తీసుకువచ్చింది. పరీక్ష చరిత్రలోనే తొలిసారిగా అభ్యర్థులకు కంప్యూటర్ తెరపై ఆన్-స్క్రీన్ బేసిక్ క్యాలిక్యులేటర్ (On-screen non-scientific calculator) సదుపాయాన్ని కల్పించనుంది. 10 నుంచి 12 అంకెల డిస్ప్లేతో ఉండే ఈ నాన్-సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ద్వారా గణనలను వేగంగా పూర్తి చేసే అవకాశం విద్యార్థులకు లభించనుంది.
మే 23న ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్-2 పరీక్షలను ఆన్లైన్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు.
అర్హత నిబంధనల ప్రకారం.. జేఈఈ మెయిన్ 2027లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 2.5 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. అభ్యర్థులు 2026 లేదా 2027 సంవత్సరంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (12వ తరగతి) పూర్తి చేసి ఉండాలి లేదా పరీక్షలకు హాజరవుతూ ఉండాలి. గరిష్ఠంగా వరుసగా రెండేళ్లలో రెండు సార్లు మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ రాసే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే పరీక్ష తేదీ మరియు అర్హత వివరాలను వెల్లడించిన ఐఐటీ ఢిల్లీ, రిజిస్ట్రేషన్ తేదీలు, సిలబస్, ఇతర మార్గదర్శకాలతో కూడిన పూర్తి సమాచార బ్రోచర్‌ను త్వరలోనే అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనుంది.



































