భారత పైలట్ స్మిత్ మచ్ఛర్‌ రియల్ హీరో.. ప్రధానులు మోదీ, నెతన్యాహు, అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు

PM Modi and President Trump Praises Indian Pilot Smit Machchhar in Flydubai Flight Incident

ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న కాక్‌పిట్‌ ఘటనలో ధైర్యంగా వ్యవహరించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మచ్ఛర్‌ను హీరోగా అభివర్ణించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రయాణికుల రక్షణకు ఆయన చేసిన ప్రయత్నాలను నేతలు కొనియాడారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోదీ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. “కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఒక నిజమైన హీరో. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, తీవ్రమైన గాయాలైనప్పటికీ ఆయన ప్రదర్శించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం వందలాది ప్రాణాలను కాపాడాయి. ఒక పెద్ద ప్రమాదాన్ని అడ్డుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారు. ప్రజల సాల్యూట్: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆయన సాహసానికి సాల్యూట్ చేస్తున్నారని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా” అని తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఘటనపై ప్రత్యేకంగా స్పందిస్తూ.. “గాయపడినప్పటికీ భారతీయ పైలట్ సమయస్ఫూర్తితో కాక్‌పిట్ తలుపులు తెరవడం మరియు ప్రయాణికుల సాయం కోరడం అద్భుతం. తీవ్రమైన రక్తస్రావమవుతున్నప్పటికీ ఆయన హీరోలా పోరాడి విమానం కూలిపోకుండా కాపాడారు.” అని కొనియాడారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినప్పుడు ఈ ఘటన తీవ్రత తెలిసిందని, భారతీయ పైలట్ మరియు ప్రయాణికులు చూపిన సాహసంతో పెద్ద ముప్పు తప్పిందని ట్రంప్ వెల్లడించారు.

“నిజమైన హీరో” అన్న నెతన్యాహు

మచ్ఛర్‌ ధైర్యాన్ని నెతన్యాహు ప్రత్యేకంగా ప్రశంసించారు. వందలాది ప్రాణాలను కాపాడడంలో ఆయన చర్యలు కీలకమయ్యాయని పేర్కొన్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మచ్ఛర్ చూపిన ధైర్యాన్ని అభినందిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అసలేం జరిగిందంటే..?

దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం 174 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తుండగా, కోపైలట్‌ భారత కెప్టెన్‌పై దాడి చేసినట్లు అధికారులు, మీడియా నివేదికలు వెల్లడించాయి. ఈ ఘటనలో విమానం ఒక్కసారిగా వేల అడుగుల ఎత్తు కోల్పోయింది.

కాక్‌పిట్‌ తలుపు తెరిచి..

తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్ఛర్ కాక్‌పిట్‌ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి చేరుకుని దాడి చేసిన కోపైలట్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ఫ్లైదుబాయ్ పైలట్లు అనంతరం విమానాన్ని నియంత్రించి సౌదీ అరేబియాలోని తబుక్‌ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here