కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా పరిపాలనా విజక్షన, దూరదృష్టి కారణంగానే దేశ అంతర్గత భద్రతా వ్యవస్థలు అత్యంత సమర్థవంతంగా మారాయని ప్రధాని కొనియాడారు.
ముఖ్యంగా దేశంలో మావోయిజం నిర్మూలన దిశగా సాధించిన విజయాలు, అలాగే మత్తు పదార్థాలు (డ్రగ్స్) లేని సమాజాన్ని నిర్మించడంలో ఆయన చూపుతున్న చొరవ ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజాసేవలో ఆయనకు సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా బలమైన నాయకత్వాన్ని, దేశ భద్రత కోసం ఆయన చేస్తున్న అవిశ్రాంత కృషిని సీఎం చంద్రబాబు కొనియాడారు. దేశ భద్రత, ఐక్యత కోసం ఆయన చూపుతున్న నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అమిత్ షా ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని, దేశ సేవలో మరెన్నో సంవత్సరాలు కొనసాగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రతను పటిష్టం చేయడంలో మరియు సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో అమిత్ షా తీసుకుంటున్న ధైర్యవంతమైన నిర్ణయాలు, చూపిస్తున్న అంకితభావం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజల సేవలో ఆయన మరెన్నో ఆయురారోగ్యాలు, విజయాలు సాధించాలని, దేశాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన ప్రయాణం దిగ్విజయంగా సాగాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
మంత్రి నారా లోకేశ్ కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని సురక్షితంగా ఉంచాలన్న ఆయన సంకల్పం, సమైక్య భారత్ కోసం చేస్తున్న నిరంతర కృషి లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమిత్ షా అందిస్తున్న నిరంతర సహకారానికీ రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని, దేశ సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.






































