ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా సంకల్ప జ్యోతి ప్రజ్వలన చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సేవా సంకల్ప యాత్రికులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ.. ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం ఏర్పడింది.
తన 25 ఏళ్ల ప్రజా సేవా ప్రయాణాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇంత సుదీర్ఘ కాలం ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని తాను నాడు ఊహించలేదని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం, విశ్వాసమే తనకు నిరంతరం బలంగా నిలిచాయని పేర్కొన్నారు. దేశ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ మరచిపోలేనన్నారు.
ప్రజలు, పార్టీ శ్రేణుల మద్దతుతోనే తాను ముందుకు సాగుతున్నానని మోదీ అన్నారు. ప్రజా సేవ చేసేందుకు భగవంతుడు తనకు శక్తిని ఇచ్చారని పేర్కొన్నారు. తన ప్రయాణంలో ఎదురైన ప్రతి ఘటన నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నానని, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపనతో ఉంటానన్నారు.
సవాళ్లు తనను మరింత బలంగా నిలబెట్టాయని ప్రధాని చెప్పారు. దేశం తనకు ఎంతో ఇచ్చిందని, అందుకే దేశమే తనకు ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మరింత కృషి చేస్తానని మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం తన సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తానని తెలిపారు.






































