అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ ఓవల్ ఆఫీస్ వేదికగా భారతదిగ్గజ పారిశ్రామిక సంస్థ ‘ఎస్సార్ గ్రూప్’ (Essar Group) అమెరికాలోని అయోవా (Iowa) రాష్ట్రంలో అత్యంత భారీ స్టీల్ ప్లాంట్‌ను నిర్మించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అని వర్ణించిన ట్రంప్, ఈ ప్రాజెక్ట్ విలువ దాదాపు 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) అని వెల్లడించారు.
అయోవా స్టీల్ ప్లాంట్ – ముఖ్యాంశాలు:
-
రూ. 1.25 లక్షల కోట్ల భారీ పెట్టుబడి: ఎసార్ గ్రూప్‌నకు చెందిన ‘మెసాబీ మెటాలిక్స్’ (Mesabi Metallics) సంస్థ ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టనుంది. వైట్‌హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎసార్ గ్రూప్ కో-ఫౌండర్ రవి రుయా, ఆయన కుమారుడు రేవంత్ రుయాలు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి పాల్గొన్నారు.
-
మిన్నెసోటా గనుల నుంచి ముడిసరుకు: అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని తమ గనుల నుంచి సేకరించిన ఇనుప ఖనిజాన్ని నేరుగా అయోవాలోని ఈ స్టీల్ ప్లాంట్‌కు తరలించి ఉక్కు ఉత్పత్తి చేపడతారు. అమెరికాలో గత 50 ఏళ్లలో ప్రారంభమైన మొదటి కొత్త ఇనుప ఖనిజం గని ఇదేనని ట్రంప్ పేర్కొన్నారు.
-
ఉత్పత్తి సామర్థ్యం & గడువు: ఈ ప్రాజెక్ట్ మొదటి విడతలో ఏడాదికి 7.5 మిలియన్ టన్నుల ఉక్కును తయారు చేయనుండగా, భవిష్యత్తులో దీని సామర్థ్యం 10 మిలియన్ టన్నులకు పెరగనుంది. 2030 నాటికి ఇక్కడ వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
-
భారీ ఉద్యోగ అవకాశాలు: ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణ దశలో 5,000 నుండి 6,000 మందికి ఉపాధి లభించనుండగా, ప్లాంట్ పూర్తయ్యాక 1,750 మందికి పైగా శాశ్వత ఉద్యోగాలు లభిస్తాయని అమెరికా అధికారులు తెలిపారు. రాబోయే 10 ఏళ్లలో ఈ ప్లాంట్ ద్వారా సుమారు 95 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్రయోజనం అమెరికాకు చేకూరనుందని అంచనా వేస్తున్నారు.
“అమెరికా ఉక్కు రంగానికి ఇది ఒక కొత్త ఊపిరి పోస్తుందని, ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఉక్కును ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేస్తాం” అని ఈ సందర్భంగా ట్రంప్ మరియు రేవంత్ రుయా పేర్కొన్నారు.








































