అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో భద్రతను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా, గత ఏడాది జనవరిలో ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 3 లక్షలకు పైగా వీసాలను అమెరికా యంత్రాంగం రద్దు చేసింది.
అమెరికా చరిత్రలో మరే అధ్యక్షుడు చేయని విధంగా రికార్డు స్థాయిలో వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ రద్దు చేసిన వీసాలలో ప్రధానంగా ‘బర్త్ టూరిజం’ కోసం నిబంధనలను ఉల్లంఘించి వచ్చిన వారు, అలాగే అటువంటి చర్యలకు సహకరించిన సుమారు 4 వేల మందికి సంబంధించిన వీసాలు ఉన్నాయి.
వీటితో పాటు హింసాత్మక ఘటనలు, ప్రజా భద్రతకు ముప్పు కలిగించడం, మోసపూరిత పద్ధతులు, తప్పుడు సమాచార వ్యాప్తి మరియు మద్యం తాగి వాహనాలు నడపడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన విదేశీ పౌరుల వీసాలను రద్దు చేసినట్లు స్థానిక మీడియా కథనాలు స్పష్టం చేశాయి.
అమెరికాలో ఉంటూ స్థానిక చట్టాలను ఉల్లంఘించే వారిపై, జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే వారిపై కఠిన చర్యలు తప్పవని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది. వీసా జారీకి ముందే అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించే ‘సోషల్ మీడియా వెట్టింగ్’ విధానాన్ని మరింత విస్తృతం చేశారు. అలాగే, గడువు ముగిసినా దేశంలోనే అక్రమంగా కొనసాగుతున్న విదేశీ విద్యార్థులు మరియు పౌరులపై నిఘా పెంచి ఈ చర్యలను ముమ్మరం చేశారు.








































