ఇకపై వాట్సాప్‌లో విద్యుత్, గ్యాస్ బిల్లుల చెల్లింపులు, రీఛార్జ్‌లు

WhatsApp CEO Kunal Shah Reveals, Electricity, Gas, Water Bills and Recharges Directly With Chat Box

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) వినియోగదారులకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు సరికొత్త ఫీచర్లు, భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు వాట్సప్ సీఈఓ కునాల్‌ షా సోషల్ మీడియా వేదికగా కీలక అప్‌డేట్లను వెల్లడించారు. ఇకపై కేవలం సందేశాలు పంపుకోవడానికే కాకుండా, వినియోగదారులు తమ రోజూవారీ పనులను మరింత సులభంగా పూర్తి చేసుకునేలా యాప్‌ను తీర్చిదిద్దుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కునాల్‌ షా ప్రకటించిన వివరాల ప్రకారం.. వాట్సప్‌లో ప్రధానంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మొదటిది కమ్యూనికేషన్‌ను మరింత సులభతరం చేయడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోజుకు 1,000 కోట్లకు పైగా వాయిస్ మెసేజ్‌లు, 400 కోట్లకు పైగా స్టిక్కర్లు పంపుతున్న నేపథ్యంలో.. వాయిస్ నోట్స్, గ్రూప్స్, స్టిక్కర్స్, వీడియో కాలింగ్ ఫీచర్లను మరింత సరళంగా, ఆకర్షణీయంగా మార్చనున్నారు.

రెండవది రోజువారీ సేవలు. చాలా పనులు చాటింగ్‌తో ప్రారంభమై వేరే యాప్‌లకు మారాల్సి వస్తుందని, దానికి ముగింపు పలకాలని కంపెనీ భావిస్తోంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికాం భాగస్వాముల సహకారంతో విద్యుత్, వంటగ్యాస్ బిల్లుల చెల్లింపులు, ఫాస్టాగ్‌ రీఛార్జ్‌లు, మెట్రో టికెట్ల కొనుగోలు, రుణాలు తీసుకోవడం వంటి సేవలను నేరుగా వాట్సప్ చాట్ బాక్స్ నుంచే చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.

మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనుసంధానం. మెటా ఏఐ (Meta AI) సాయంతో వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందించడంతో పాటు, ప్రయాణాలు లేదా అపాయింట్‌మెంట్‌లను గుర్తుచేసేలా ఏఐ నిశ్శబ్దంగా బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తుందని వివరించారు. ఇన్ని కొత్త సేవలు వస్తున్నప్పటికీ, వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని.. కాల్స్, మెసేజ్‌లకు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్ విధానం యథావిధిగా కొనసాగుతుందని కునాల్‌ షా భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here