ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తన వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. హోమ్‌పేజీని మరింత వ్యక్తిగతంగా మార్చుకునే అవకాశం కల్పిస్తూ ‘కస్టమ్ ఫీడ్స్’ (Custom Feeds) ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో యూజర్లు తమ ఆసక్తులకు అనుగుణంగా వీడియోలను ఒక ప్రత్యేక ఫీడ్‌లో చూసే అవకాశం ఉంటుంది. దీనితో పాటు మొబైల్ యాప్ నావిగేషన్‌లోనూ కొన్ని మార్పులు చేస్తోంది.
ఇప్పటివరకు యూట్యూబ్ హోమ్‌పేజీలో కనిపించే టాపిక్ చిప్స్ స్థానంలో కొత్త కస్టమ్ ఫీడ్స్ విధానం అందుబాటులోకి వస్తోంది. హోమ్‌పేజీ పైన ఉన్న ‘+’ బటన్‌ను ట్యాప్ చేసి, తమకు ఆసక్తి ఉన్న అంశం లేదా కంటెంట్ గురించి పేర్కొంటే, దానికి అనుగుణంగా యూట్యూబ్ ప్రత్యేక వీడియో ఫీడ్‌ను రూపొందిస్తుంది. కొత్త వీడియోలు అందుబాటులోకి వచ్చినప్పుడు ఈ ఫీడ్ కూడా అప్‌డేట్ అవుతుంది. తద్వారా ప్రతిసారీ కొత్తగా వెతకాల్సిన అవసరం తగ్గుతుంది.
ఈ ఫీచర్‌లో ఉచిత వినియోగదారులు గరిష్టంగా మూడు కస్టమ్ ఫీడ్స్‌ను సేవ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లు ఎనిమిది ఫీడ్స్ వరకు భద్రపరుచుకోవచ్చు. యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ కూడా ఈ ఫీచర్ గురించి ఎక్స్ వేదికగా వెల్లడించారు. వినియోగదారులు తమ హోమ్‌పేజీని మరింతగా వ్యక్తిగతీకరించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
మరోవైపు యూట్యూబ్ మొబైల్ యాప్‌లో కొత్త టాప్ నావిగేషన్ బార్‌ను పరీక్షిస్తోంది. ఇందులో సబ్‌స్క్రిప్షన్స్‌తో పాటు లైవ్, మ్యూజిక్ వంటి విభాగాలకు త్వరగా చేరుకునే షార్ట్‌కట్‌లు ఉండనున్నాయి. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ను అమెరికాలో 13 ఏళ్లు పైబడిన, ఇంగ్లీష్ భాషా సెట్టింగులు కలిగిన కొంతమంది యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్‌కు వాచ్ హిస్టరీ, సెర్చ్ హిస్టరీ ఆన్‌లో ఉండాల్సి ఉంటుంది. మొబైల్‌లో రూపొందించిన ఫీడ్స్ డెస్క్‌టాప్‌లోనూ సింక్ అవుతాయి. ఇతర ప్రాంతాల్లో అందుబాటు వివరాలు అధికారిక ప్రకటనలపై ఆధారపడి ఉంటాయి.








































