బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. నాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘ది ప్యారడైజ్’ను శనివారం రాత్రి వీక్షించనున్నట్లు ఆయన వెల్లడించారు.
After many many years, going to a theatre tonight to watch one of my favourite actors @NameisNani and the talented young director @odela_srikanth in “The Paradise”
— KTR (@KTRBRS) September 26, 2026
ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి సినీ మరియు రాజకీయ వర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతుండటంతో, స్వయంగా కేటీఆర్ ఈ చిత్రాన్ని చూడటానికి సిద్ధమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మాజీ సీఎం కేసీఆర్ను పోలిన ‘శంకర్’ పాత్రపై సర్వత్రా ఆసక్తి
‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటుడు ప్రియదర్శి పోషించిన ‘ఎమ్మెల్యే శంకర్’ (శంకరన్న) పాత్ర ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ పాత్రలో ప్రియదర్శి హావభావాలు, మాట్లాడే యాస, నడక శైలి మరియు బాడీ లాంగ్వేజ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు)ను గుర్తుచేసేలా రూపొందించారు.
కేసీఆర్ను ప్రతిబింబించేలా ఉన్న ఈ పాత్రను ప్రియదర్శి అద్భుతంగా పండించారని, ఆయన నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తన తండ్రి కేసీఆర్ ఛాయలున్న పాత్ర ఉన్న ఈ చిత్రాన్ని కేటీఆర్ చూడనుండటం సినీ, రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇక ఇదిలావుంటే, మరోవైపు ప్యారడైజ్ చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే రూ.114 కోట్లు రాబట్టి నాని కెరీర్ లోనే అత్యంత వేగంగా రూ.100 కోట్లు వసూళ్లు అందుకున్న సినిమాగా రికార్డ్ సృష్టించింది. నేడు, రేపు వీకెండ్ కావడంతో మరో రేండు రోజులు గడిచేసరికి రూ.200 కోట్ల క్లబ్ లోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుండటం విశేషం.





































