సీఎం రేవంత్ మంత్రాంగం.. సమ్మక్క సాగర్‌ బ్యారేజీ ఎన్‌ఓసీకి ఛత్తీస్‌గఢ్‌ గ్రీన్ సిగ్నల్

CM Revanth Reddy Meets Chhattisgarh CM Vishnu Deo Sai For Secures Assurance on Sammakka Sagar NOC

తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో అత్యంత కీలకమైన సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఉన్న అడ్డంకులను తొలగించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి మరో కీలక ముందడుగు వేశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌ కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం (నవంబర్ 17) ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు.

ఈ భేటీలో సమ్మక్క సాగర్ బ్యారేజీకి సంబంధించిన నిరభ్యంతర పత్రం (NOC) జారీతో పాటు ప్రాజెక్టుకు అవసరమైన ఇతర అనుమతులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణకు నీటి అవసరాలు భారీగా పెరగనున్నాయని, అందువల్ల బ్యారేజీలో నీటి నిల్వకు అనుమతితో పాటు వెంటనే ఎన్‌ఓసీ జారీ చేయాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ సీఎం విజ్ఞప్తి పట్ల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి అత్యంత సానుకూలంగా స్పందించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీకి సంబంధించిన ఎన్‌ఓసీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి అందిస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వల్ల ఛత్తీస్‌గఢ్ భూభాగంపై పడే ముంపు ప్రభావం గురించి సాంకేతిక నివేదికలను తెలంగాణ బృందం వివరించింది.

ప్రఖ్యాత ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఛత్తీస్‌గఢ్ పరిధిలో కేవలం 33 ఎకరాల వరకు మాత్రమే ముంపు ఉంటుందని, అత్యంత భారీ వరదలు వచ్చిన సమయంలో కూడా ముంపు ప్రాంతం 100 ఎకరాలకు మించదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అవసరమయ్యే భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం మరియు పునరావాస కార్యక్రమాలకు అయ్యే పూర్తి నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

ఇప్పటికే ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని ఆయన వెల్లడించారు. 83 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టం (FRL) వద్ద ఈ బ్యారేజీలో 6.94 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉందని, ఇక్కడి నుంచి గోదావరి జలాలను మళ్లించడం ద్వారా శ్రీరాంసాగర్ రెండో దశ సహా సుమారు 4.40 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు మార్గమధ్యంలోని గ్రామాలకు తాగునీరు అందించవచ్చని వివరించారు.

ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలోనూ సమ్మక్క సాగర్ ఎన్‌ఓసీ అంశాన్ని రేవంత్‌రెడ్డి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. తాజాగా రాయ్‌పూర్ పర్యటనలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి నుంచి సానుకూల హామీ లభించడంతో, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియ వేగవంతం కానుందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here