తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ వివాదం మరియు ఎత్తు పెంపు అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రాణహిత నదిపై నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించే దిశగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, ఫడ్నవీస్ సోమవారం ముంబైలోని సహ్యాద్రి రాష్ట్ర అతిథి గృహంలో సమావేశమై బ్యారేజీ డిజైన్, ఎత్తు, ముంపు ప్రభావం వంటి అంశాలపై చర్చించారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలన్న తెలంగాణ ప్రతిపాదనను సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు వివరించారు. ఈ ఎత్తుతో ప్రాజెక్టుకు కలిగే ప్రయోజనాలు, ముంపు ప్రభావం, పరిహారం, పునరావాసానికి సంబంధించిన అంశాలను వివరించారు. గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు 152 మీటర్ల ఎత్తు అవసరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
గతంలో కుదిరిన 148 మీటర్ల ఒప్పందాన్ని పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫడ్నవీస్ తెలిపినట్లు సమాచారం. మహారాష్ట్రకు నష్టం కలగని పక్షంలో బ్యారేజీ ఎత్తు పెంపు ప్రతిపాదనను పరిశీలిస్తామని పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే భూములకు మహారాష్ట్ర నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలను కూడా వివరించారు.
బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావంపై ఇరు రాష్ట్రాల అధికారులు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం అధికారుల కమిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనను చర్చించారు. అధ్యయన నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా, డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని రేవంత్‌రెడ్డి ఫడ్నవీస్‌ను ఆహ్వానించారు.







































