సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా గతంలో దేశవ్యాప్తంగా జరిగిన ‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు ‘SIR గో బ్యాక్’ ఉద్యమానికి సమయం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన ‘ది కాన్‌క్లేవ్ 2026’లో ‘ఇండియాస్ నెక్ట్స్ చాప్టర్’ అంశంపై ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణ, డీలిమిటేషన్, తెలంగాణ రాజకీయాలతో పాటు తన రాజకీయ ప్రస్థానంపై సీఎం వివరించారు.
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) పేరుతో ఓటర్ల హక్కులకు నష్టం జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. దేశ జనాభా పెరుగుతున్న సమయంలో ఓటర్ల సంఖ్య తగ్గడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఓటర్ల తొలగింపుపై తనకు ఆందోళనలు ఉన్నాయని చెబుతూ, దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఈ అంశంపై ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
శివుడు పేదల దేవుడు – రాముడు రాజుల దేవుడు
అలాగే ‘హర్ హర్ మహదేవ్’ మరియు ‘జై శ్రీరామ్’ నినాదాల వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ మరియు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఉత్తరాదిలో బీజేపీ నేతలు కేవలం ‘జై శ్రీరామ్’ నినాదాన్ని మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారని, ‘హర్ హర్ మహదేవ్’ అని ఎందుకు అనరని ప్రశ్నించారు. చారిత్రాత్మకంగా శ్రీరాముడు రాజులకు, పాలకులకు ప్రతిరూపమని, అదే సమయం లో పరమశివుడు సాధారణ ప్రజలు, కష్టజీవులు మరియు పేదల ఆరాధ్యదైవమని అభివర్ణించారు. ద్రవిడ సంస్కృతిలో శివారాధనకు ఉన్న ప్రాధాన్యతను ఆయన గుర్తుచేస్తూ, దక్షిణాది మరియు ఉత్తరాది రాజకీయ, సాంస్కృతిక వ్యత్యాసాలను వివరించే ప్రయత్నం చేశారు.
ఓటర్ల తొలిగింపు కుట్రలపై హెచ్చరిక
ఆధ్యాత్మిక అంశాలతో పాటు రాజకీయ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు మరియు ఓటర్ల తొలగింపు చర్యలపై బీజేపీని విమర్శించారు. ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాల ఓట్లను కుట్రపూరితంగా తొలగించే ప్రక్రియ కొనసాగితే దేశవ్యాప్త నిరసనలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ల మధ్య విభేదాలు సృష్టిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎక్కడ ఉన్నా దేశం కోసమే పనిచేస్తా..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయాణాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాజకీయాలపై మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉత్తరాది తరహా విద్యార్థి రాజకీయాలు లేవని రేవంత్ అన్నారు. ABVPలో విద్యార్థి నాయకులుగా ఎదిగిన వారు తర్వాత ఇతర పార్టీల్లో రాజకీయాలు చేస్తున్న ఉదాహరణలను ప్రస్తావించారు.
2006లో స్వతంత్ర ZPTC సభ్యుడిగా, 2007లో స్వతంత్ర MLCగా గెలిచిన తర్వాత టీడీపీలో చేరి 2009, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించానని చెప్పారు. 2017లో కాంగ్రెస్‌లో చేరి, 2019లో ఎంపీగా గెలిచినట్లు వివరించారు. రాహుల్ గాంధీతో తొలి భేటీ తనను కాంగ్రెస్ వైపు మరింతగా ఆకర్షించిందని రేవంత్ పేర్కొన్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో తనపై కేసులు, జైలు అనుభవాలను కూడా రేవంత్ ప్రస్తావించారు. తాను ఏ రాజకీయ వేదికలో ఉన్నా రాష్ట్రం, దేశ ప్రయోజనాల కోసం పనిచేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.






































