తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డి సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు కీలక ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు కమిషనరేట్ కార్యాలయ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సీఎం రేవంత్ సమీక్షించనున్నారు. ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, పనుల అమలు, తదుపరి కార్యాచరణపై అధికారులతో చర్చించే అవకాశం ఉంది. ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులకు అవసరమైన సూచనలు ఇవ్వనున్నారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. అదే ప్రాంగణంలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు. సమ్మిట్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల పురోగతిపై వివరాలు తెలుసుకోనున్నారు.
అలాగే, ఫ్యూచర్ సిటీ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైనాసీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త పోలీసు కమిషనరేట్ ప్రారంభంతో పాటు ప్రాంతంలో పోలీసు వ్యవస్థ బలోపేతం, భద్రతా నిర్వహణకు సంబంధించిన అంశాలు ఈ పర్యటనలో ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు.







































