బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలకు చింతిస్తున్నా – మాజీ మంత్రి కొండా సురేఖ

Former Minister Konda Surekha Withdraws Past Remarks Against BRS Working President KTR

తెలంగాణ రాజకీయ వర్గాలలో తీవ్ర సంచలనం సృష్టించిన పాత వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై తాను చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు స్పష్టతనిస్తూ, ఆ మాటలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

ఈ మేరకు తాజాగా ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కీలక ప్రకటన విడుదల చేశారు. అప్పట్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల ఒత్తిడిలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందే తప్ప, వ్యక్తిగతంగా ఎవరిని కించపరచాలనే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు.

ఆనాడు తాను చేసిన నిరాధారమైన వ్యాఖ్యలు చేసి ఉండకూడదని కొండా సురేఖ తన ప్రకటనలో పేర్కొన్నారు. కేటీఆర్‌ను గానీ, ఆయన కుటుంబ సభ్యులను గానీ బాధపెట్టాలని లేదా వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం తనలో ఎన్నడూ లేదని ఆమె స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల వల్ల వారు మనస్తాపానికి గురై ఉంటే తీవ్రంగా చింతిస్తున్నానని తెలిపారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.

రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకునేటప్పుడు హద్దులు మీరకూడదన్న చర్చ ఈ ప్రకటన ద్వారా మరోసారి తెరపైకి వచ్చింది. ఇరువర్గాల మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న రాజకీయ, వ్యక్తిగత పోరు నేపథ్యంలో కొండా సురేఖ స్వయంగా క్షమాపణలు కోరడం మరియు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాగా ఇటీవలే కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై ఆమె తనయ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడం, సురేఖకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ నోటీసులు ఇవ్వడం.. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆమె మంత్రి పదవిని త్యజించాల్సి రావడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం సృషించింది.

ఈ తరుణంలోనే ఆమె ఇలా హఠాత్తుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సానుకూలంగా ట్వీట్ చేయడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు సామాజిక మాధ్యమాలలో ఈ పోస్ట్ వైరల్ కావడంతో, వివిధ పార్టీల శ్రేణులు మరియు నెటిజన్లు దీనిపై విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here