రేవంత్ సర్కార్ కీలక ఉత్తర్వులు.. ఓంకారేశ్వర ఆలయానికి రూ.1,108.27 కోట్లతో అనుమతులు

Telangana Govt Approves Rs.1,108 Cr For Omkareshwar Temple Complex Under Musi Revitalization

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో నిర్మించనున్న శ్రీ ఓంకారేశ్వర ఆలయ సముదాయానికి రేవంత్ సర్కార్ భారీగా నిధులు కేటాయించింది. ఆలయ నిర్మాణంతో పాటు దానికి అనుసంధానంగా ఆరు లేన్ల రోడ్డు నిర్మాణానికి కలిపి రూ.1,108.27 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు మెట్రోపాలిటన్‌ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ జీవో జారీ చేసింది.

ఓంకారేశ్వర ఆలయ సముదాయం నిర్మాణానికి రూ.948.65 కోట్లు కేటాయించారు. మూసీ నది ఒడ్డున ఉన్న చారిత్రక శ్రీ వీరభద్ర స్వామి ఆలయం సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ప్రధాన ఆలయంతో పాటు శ్రీ వీరభద్రుడు, భద్రకాళి, లలితా త్రిపురసుందరి, బాలగణపతి, బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను కూడా నిర్మించనున్నారు.

మహామండపం, నంది మండపం, ప్రాకారాలు, రాజగోపురం, యాగశాల, పుష్కరిణితో పాటు భారీ మహాశివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆలయ సముదాయానికి అనుసంధానంగా ఆరు లేన్ల రోడ్డు నిర్మాణానికి మరో రూ.159.62 కోట్లు మంజూరయ్యాయి.

ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్‌అండ్‌బీ, పబ్లిక్‌ హెల్త్‌, ఎంఆర్‌డీసీఎల్‌, దేవాదాయ శాఖల ఉన్నతాధికారులతో పాటు స్థపతి, ఆర్థిక శాఖ ప్రతినిధి కమిటీలో సభ్యులుగా ఉంటారు. నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ కమిటీ పర్యవేక్షణ కొనసాగించనుంది.

ఈ ఏడాది మార్చి 28న సీఎం రేవంత్‌రెడ్డి మంచిరేవులలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో 8 ఎకరాల్లో రూ.700 కోట్ల అంచనాతో క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తాజాగా ఆలయ నిర్మాణానికి రూ.948.65 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు కావడం ప్రాజెక్టులో కీలక ముందడుగుగా నిలిచింది.

మంచిరేవుల వీరభద్రస్వామి గుట్ట ప్రాజెక్టు విశేషాలు

  • కాకతీయుల వాస్తుశైలిలో ఆలయం: శ్రీశైలం శృంగేరి పీఠం సూచనల ప్రకారం, కాకతీయుల నాగర వాస్తుకళా నమూనాలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. తెలంగాణలోని చారిత్రక రామప్ప దేవాలయం నిర్మాణంలో ఉపయోగించిన రాయి తరహా రాతిని ఈ నిర్మాణానికి ప్రాధాన్యంగా వాడనున్నారు.

  • మహా రాజగోపురం & ప్రాకారాలు: ఈ క్షేత్ర ప్రాంగణంలో 91 అడుగుల ఎత్తుతో 9 అంతస్తుల భారీ రాజగోపురం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీటితో పాటు 44 స్తంభాలతో కూడిన మహా మండపం, నంది మండపం, యాగశాల, పుష్కరిణి మరియు రెండు విస్తృత ప్రాకారాలను రూపుదిద్దనున్నారు.

  • నది నడిబొడ్డున 100 అడుగుల శివుని విగ్రహం: మంచిరేవుల వద్ద ప్రవహించే మూసీ నదిలో ఎత్తైన వేదికపై 100 అడుగుల బృహత్ శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేలా డిజైన్ రూపొందించారు.

  • రవాణా & పర్యాటక వసతులు: ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నుంచి ఆలయానికి నేరుగా విశాలమైన కనెక్టివిటీ రోడ్లు, వాహనాల పార్కింగ్ సదుపాయాలు కల్పించనున్నారు. విగ్రహం చుట్టూ మూసీ నీటిని నిల్వ చేసేందుకు చిన్నపాటి ఆనకట్టను నిర్మించి, చుట్టుపక్కల సుందరమైన పార్కులు మరియు బోటింగ్ పర్యాటక వసతులు ఏర్పాటు చేయనున్నారు.

  • సాంకేతిక కమిటీ పర్యవేక్షణ: రూ. 700 కోట్ల ప్రాథమిక వ్యయ అంచనాతో సాగే ఆలయ నిర్మాణ నాణ్యత, డీపీఆర్, డిజైన్లు మరియు టెండర్ ప్రక్రియలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం రోడ్లు-భవనాల శాఖ (R&B) ENC నేతృత్వంలో ఉన్నతస్థాయి టెక్నికల్ కమిటీని నియమించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here