ఉద్యోగుల హామీలు అమలు చేయకుంటే హైదరాబాద్ దిగ్బంధం – తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత

Telangana Rakshana Sena Chief Kavitha Slams CM Revanth Reddy Over Employees’ Issues

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అల్టిమేటం జారీ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను సెప్టెంబర్ 18లోగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే హైదరాబాద్ దిగ్బంధానికి సిద్ధం కావాలని ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు తాజాగా హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై టీఆర్ఎస్ నిర్వహించిన సదస్సులో కవిత మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యలను ప్రస్తావిస్తే ప్రభుత్వం వారిని బెదిరిస్తోందని ఆమె ఆరోపించారు. ఉద్యోగులు తమ హక్కులు, ప్రయోజనాల కోసం చేసే పోరాటానికి టీఆర్ఎస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రజలకు పారదర్శకమైన, మెరుగైన పాలన అందించాలంటే ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని, అలాంటి ఉద్యోగులను రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మాట తప్పడం, మడమ తిప్పడమే సీఎం రేవంత్ రెడ్డి ట్రేడ్‌మార్క్‌గా మారిందని టీఆర్ఎస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని, అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులు, టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కవిత అన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దాదాపు 600 మండలాలకు కేవలం 8 మంది మాత్రమే పర్మినెంట్ ఎంఈఓలు ఉండటం వల్ల విద్యా వ్యవస్థ పర్యవేక్షణ దెబ్బతింటోందని చెప్పారు. హెడ్‌మాస్టర్లు, సీనియర్ టీచర్లకు ఎంఈఓల బాధ్యతలు అప్పగించడం, ఉపాధ్యాయులకు బోధనకు బదులుగా అదనపు పనులు అప్పగించడం సరికాదన్నారు.

గురుకులాలు, డిగ్రీ కాలేజీల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడం లేదని కవిత విమర్శించారు. టీచర్లకు సీనియారిటీ ఆధారంగా రావాల్సిన ప్రమోషన్లు కూడా సకాలంలో ఇవ్వడం లేదని అన్నారు. ప్రతి గ్రామంలో పాఠశాల, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా టీఆర్ఎస్ విధానాన్ని రూపొందించిందని, తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

51 శాతం ఫిట్‌మెంట్ వెంటనే ఇవ్వాలి

ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, పీఆర్సీ, హెల్త్ కార్డులు, పదవీ విరమణ ప్రయోజనాలు తదితర అంశాలపైనా కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగులకు వెంటనే 51 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 32 నెలలుగా డీఏ పెండింగ్‌లో ఉందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్ కార్డు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సక్రమంగా పనిచేస్తుందా అని సీఎం రేవంత్ రెడ్డికి ఆమె సవాల్ విసిరారు.

ఉద్యోగ సంఘాలు ప్రస్తావిస్తున్న 37 డిమాండ్లలో చాలా వరకు ఆర్థిక భారం లేనివేనని కవిత పేర్కొన్నారు. ముఖ్యంగా 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో మహిళా ఉద్యోగులు అధికంగా ఉన్నారని, వారి ఇబ్బందులు తనను కలచివేస్తున్నాయని అన్నారు.

ఓపీఎస్ అమలు చేయాలి

2003లో నియమితులైన పోలీసులతో పాటు ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. 2003లో నియమితులైన టీచర్లను ఓపీఎస్‌లోకి తీసుకువస్తే ప్రభుత్వానికి భారీగా ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని, ఆ నిధులను ఉద్యోగుల ఇతర బకాయిల చెల్లింపులకు ఉపయోగించవచ్చని సూచించారు.

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కవిత కోరారు. జీతాలు ఆలస్యమైనప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వారు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ దిగ్బంధం

ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనలను పదేపదే వాయిదా వేసుకోవడం వల్ల కిందిస్థాయి ఉద్యోగుల్లో నమ్మకం తగ్గుతోందని కవిత వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు భయపడాల్సిన అవసరం లేదని, తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు గడువులోగా అమలు కాకపోతే హైదరాబాద్ దిగ్బంధం వంటి ఆందోళనలకు ఉద్యోగ సంఘాలు సిద్ధం కావాలని సూచించారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టే ఏ ఆందోళనకైనా టీఆర్ఎస్ నైతికంగా మద్దతు ఇస్తుందని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులను అభివృద్ధిలో భాగస్వాములుగా, డెవలపర్స్‌గా గుర్తించి గౌరవప్రదంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here