తెలంగాణలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాష్ట్ర హోంశాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీజీపీఆర్బీ) అధికారికంగా నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగాలలో ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తులకు సంబంధించిన ప్రొఫార్మా మరియు ఆన్లైన్ తేదీలను త్వరలోనే బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు టీజీపీఆర్బీ ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
-
పోలీసు శాఖ (5,000 పోస్టులు):
-
సివిల్ కానిస్టేబుల్ – 3,697
-
ఏఆర్ కానిస్టేబుల్ – 1,052
-
సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) – 148
-
ఏఆర్ ఎస్సై – 14
-
టీజీఎస్పీ ఆర్ఎస్సై – 12
-
ఎస్ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్ – 24
-
ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై – 23
-
డ్రైవర్, మెకానిక్ కానిస్టేబుల్స్ – 27
-
-
ప్రత్యేక రక్షణ దళం – ఎస్పీఎఫ్ (1,424 పోస్టులు):
-
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ – 1,380
-
ఎస్పీఎఫ్ ఎస్సై – 44
-
-
అగ్నిమాపక శాఖ (790 పోస్టులు):
-
ఫైర్ ఫైటర్ – 751
-
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ – 39
-
-
జైళ్ల శాఖ (223 పోస్టులు):
-
వార్డర్లు (పురుషులు & మహిళలు) – 208
-
డిప్యూటీ జైలర్లు – 15
-
సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని బోర్డు సూచన
అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని కీలక ధ్రువీకరణ పత్రాలను ముందుగానే సమకూర్చుకోవాలని నియామక మండలి సూచించింది. ఎస్సీ అభ్యర్థులు ఉపవర్గీకరణతో కూడిన తాజా కుల ధ్రువీకరణ పత్రాన్ని, బీసీ అభ్యర్థులు 2026 ఏప్రిల్ 1 తర్వాత పొందిన నాన్-క్రీమీలేయర్ సర్టిఫికెట్ను సిద్ధం చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులు కూడా 2026 ఏప్రిల్ 1 తర్వాత పొందిన పత్రాలనే సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు 1 నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్ లేదా నివాస ధ్రువీకరణ పత్రాలు పొంది ఉంచుకోవాలని బోర్డు వెల్లడించింది.
అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందే తమ శారీరక, వైద్య ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయో లేదో సివిల్ సర్జన్ ద్వారా పరీక్షించుకోవాలని బోర్డు సలహా ఇచ్చింది. పూర్తి సమాచారం, నిబంధనల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.tgprb.in ని సందర్శించవచ్చు.







































