శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల కృష్ణా నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర జలవనరులశాఖ అధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయలసీమ జిల్లాలతో సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రాంతాల్లో తాగడానికి కూడా నీళ్లులేని పరిస్థితి నెలకుందన్నారు. ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని సీఎం స్పష్టం చేశారు. కేటాయింపులను దాటి ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకునే అవకాశమే లేదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశాకే నీటి కేటాయింపులు చేస్తుందని చెప్పారు. ఆ కేటాయింపుల పరిధిని దాటి నీటిని తీసుకెళ్లడానికి బోర్డు కూడా అంగీకరించదని చెప్పారు.
“శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే 44వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానకి అవకాశం ఉంది. ఈ స్థాయిలో నీటి మట్టం సంవత్సరానికి సగటున 10 రోజులకు మించి ఉండటం చాలా అరుదు. ఆ 10 రోజుల్లోనే రాయలసీమ మరియు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు వెళ్లాల్సి ఉంటుంది. ఇక శ్రీశైలంలో 854 అడుగుల వద్ద ఉంటే 7వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లడం కష్టం. 841 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు నుంచి వెళ్లే నీరు కేవలం వెయ్యి క్యూసెక్కులు మాత్రమే ఉంటుంది. కొత్తగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా 2 టన్నెల్స్ నుంచి గరిష్ఠంగా వెళ్లేది 9 వేల క్యూసెక్కులే. అదికూడా శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల వద్ద ఉంటేనే ఆమాత్రం నీళ్లైనా వెళ్తాయని” సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణ వైపు ఉన్న ప్రాజెక్టులను పరిశీలిస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో నీళ్లు 800 అడుగుల స్థాయిలో ఉన్నా కూడా రోజుకు 2 టీఎంసీల మేర నీటిని తరలించవచ్చని, ఇలా 90 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని చెప్పారు. ఇక కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 40 టీఎంసీల నీటిని, దిండి నుంచి 30 టీఎంసీల నీటిని, ఎస్ఎల్బీసీ ద్వారా 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu