ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాలలోని ఆడపిల్లల వివాహాల నిమిత్తం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద అందిస్తున్న ఆర్థిక సాయం ఇకపై వధువు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. గతేడాది అక్టోబరు-డిసెంబర్ నెలల మధ్య ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆర్థిక సాయం అందించగా.. ఆ సమయంలో, ఈ ఆర్థిక సహాయం వధువు బ్యాంకు ఖాతాలో జమ చేయబడింది. అయితే వివిధ వర్గాల నుంచి అందుతున్న విజ్ఞప్తుల మేరకు ఈసారి అందించే ఆర్థిక సాయాన్ని పెళ్లయిన ఆడపిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు.
అయితే తల్లి మరణించిన సందర్భంలో, వధువు నిర్ణయం ప్రకారం ఆమె తండ్రి లేదా అన్నదమ్ములు లేదా ఇతర సంరక్షకులకు ఆర్థిక సహాయం అందించబడుతుందని వారు తెలియజేశారు. అయితే కులాంతర వివాహాలు చేసుకున్న వారికి మాత్రం వధువు ఖాతాలోకే ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నట్లు వివరించారు. ఈ పథకాల కింద అర్హులైన వారు తమ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా కళ్యాణ లక్ష్మి, షాదీ తోఫా పథకాల కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు, మైనారిటీలకు రూ.లక్ష, బీసీలకు రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. అలాగే దివ్యాంగులకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు రూ.40 వేల వంతున ఆర్థిక సాయం ఇస్తోంది.
కాగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. వధువుకు 18 ఏళ్లు, వరుడుకి 21 ఏళ్లు వయస్సు కచ్చితంగా నిండి ఉండాలి. అలాగే ఇద్దరూ పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి. చదువును ప్రోత్సహించడంతో పాటూ బాల్య వివాహాలను అరికట్టడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి పెళ్లికి మాత్రమే ఈ పథకాల కింద ఆర్ధిక సాయం అందుతుంది. అయితే భర్త చనిపోయిన సందర్భంలో.. వితంతువుకు మాత్రం సాయం అందించేలా మినహాయింపు ఇచ్చారు. ఇక ఈ పథకాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు నెలసరి ఆదాయం ఉన్నవాళ్లు మాత్రమే అర్హులు. మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల మెట్ట, మాగాణి మెట్ట కలిపి మొత్తం 10 ఎకరాల లోపు ఉన్న వారు అర్హులు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల లోపు నిర్మాణ ఆస్తి కలిగి ఉండొచ్చు. అలాగే నెలకు విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE