ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామ పంచాయతీలు మరియు 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి సత్తా చాటేందుకు మరో మంచి అవకాశమని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ అత్యంత కీలకమని, ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ ఓటు అడగాలని పిలుపునిచ్చారు.
“ఐక్యతే మన బలం. ఒక కూటమి, మూడు పార్టీలు ఇదే మన విధానం. 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలి” అని సీఎం ఉద్ఘాటించారు. బుధవారం (నవంబర్ 18) పార్టీ ముఖ్యనేతల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన ఈ కీలక సూచనలు చేశారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే, వైకాపా కుట్రలను కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. కూటమి పార్టీలు క్షేత్రస్థాయిలోనూ సమన్వయంతో పనిచేయాలని, ఎక్కడా పొరపచ్చాలకు తావులేకుండా కలిసికట్టుగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాజకీయ విలువలు, మర్యాదలపై స్పందిస్తూ సొంత చెల్లెలి వ్యక్తిత్వాన్ని కించపరిచేవారు రాజకీయాలకు అనర్హులని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గ్రామస్థాయి నుంచి కూడా మంచి నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని, స్థానిక సమస్యలకు అక్కడే పరిష్కారం లభించేందుకు పంచాయతీలే సరైన వేదికని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజలు మంచి, చెడులను బేరీజు వేసుకుని ఓట్లు వేస్తున్నారని, అది ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పంచాయతీ ఎన్నికలు వేదిక కావాలని శ్రేణులకు సూచించారు.
సంక్షేమ పథకాల ద్వారా ప్రతి వర్గానికీ, ప్రతి కుటుంబానికీ అండగా నిలుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ‘సూపర్ సిక్స్’లో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నామని, ఏ కుటుంబానికి ఏం అవసరమో, ఏ గ్రామానికి ఏం చేయాలో ఆలోచించి సమకూరుస్తున్నామని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుస్తూ, మౌలిక సదుపాయాల కల్పనతో ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేస్తూ యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.



































