ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య తేడా తెలియని జగన్‌కు ఆర్థిక సంవత్సరానికి, విద్యా సంవత్సరానికి మధ్య తేడా తెలుస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందని ఎద్దేవా చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలపై వాస్తవాలను వక్రీకరిస్తూ జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం సంవత్సరాల వారీగా విడుదల చేసిన నిధుల పూర్తి వివరాలతో నివేదిక విడుదల చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఏ త్రైమాసికంలో విడుదల చేశామన్నది వేరని, ఆ నిధులను ఏ విద్యా సంవత్సరపు బకాయిలకు చెల్లించామన్నది వేరని లోకేశ్ స్పష్టం చేశారు.
ఈ కనీస అవగాహన కూడా లేకుండా మాజీ సీఎం తప్పుడు ప్రచారం చేయడం విచారకరమన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిల కోసం సుమారు రూ. 3 వేల కోట్లు విడుదల చేశామని శాసనసభలో స్పష్టంగా చెప్పామని, ఆ మాటకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఏ త్రైమాసికంలో ఎంత మొత్తం విడుదల చేశామన్న వివరాలను పట్టిక రూపంలో అందుబాటులో ఉంచామని తెలిపారు.
బడ్జెట్ అంచనాలు, సవరించిన కేటాయింపులు మరియు వాస్తవ చెల్లింపుల మధ్య ఎప్పుడూ తేడా ఉంటుందని, నిధుల విడుదలకు అనుగుణంగా బడ్జెట్‌లో సర్దుబాట్లు జరుగుతుంటాయని లోకేశ్ వివరించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి ఇటువంటి ప్రాథమిక ఆర్థిక, పరిపాలనా అంశాలు తెలియకపోవడం లేదా తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం శోచనీయమని విమర్శించారు.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఎప్పుడూ ఆలస్యంగానే విడుదలయ్యేవని, ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చేలోపు విద్యార్థుల తల్లిదండ్రులే ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని పూర్తిగా మార్చామని మంత్రి లోకేశ్ తెలిపారు. విద్యార్థులపై ఫీజుల భారం పడకుండా నేరుగా కళాశాలలకే నిధులు చెల్లించే విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి నెలా రూ. 200 నుంచి రూ. 300 కోట్ల చొప్పున క్రమం తప్పకుండా చెల్లింపులు జరుపుతున్నామని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో చెల్లించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.








































