రాష్ట్రంలో రప్పా రప్పా అంటూ ప్రజలను వేధిస్తున్నవారి తాట తీయాలని, సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారిని వదిలిపెటొద్దని ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన తాజాగా మంగళగిరిలోని ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా కీలక ప్రసంగం చేశారు.
ఏపీ పోలీసులనుద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల స్థూపం వద్ద ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. దేశ రక్షణకు, రాష్ట్ర శాంతిభద్రతలకు భంగం కలిపే ఎలాంటి అసాంఘిక చర్యలనైనా ఏపీ పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుందని ఆయన ప్రశంసించారు.
సమాజంలో పెట్టుబడులు రావాలన్నా, పారిశ్రామికాభివృద్ధి జరగాలన్నా ముందుగా ప్రజల్లో, వ్యాపార వర్గాల్లో భద్రతపై పూర్తి నమ్మకం ఉండాలని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ అధికారంలో ఉన్నా శాంతిభద్రతల పరిరక్షణకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారికి పోలీసు వ్యవస్థ ఎప్పుడూ రక్షణ కల్పించకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతూ, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, సోషల మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ‘సోషల మీడియా సైకోలను’ కూడా వదిలిపెట్టవద్దు అని హెచ్చరించారు.
టెక్నాలజీ వినియోగంలో మరియు నేరాల నిరోధంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయిప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు.








































