నాడు రవాణా మంత్రిగా.. నేడు రక్షణ మంత్రిగా ఇక్కడికి వచ్చా – కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

Defence Minister Rajnath Singh Inaugurates Navy's First Fleet Support Ship FSS-1 Named Surya at Visakhapatnam

దేశ రక్షణ రంగంలో హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (HSL) కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌ (FSS-1)కు ‘సూర్య’గా నామకరణం చేసిన శిలాఫలకాన్ని ఆయన మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

పురాతన కాలం నుంచే సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం, నౌకాయానం కొనసాగుతున్నాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ గుర్తుచేశారు. జల ఉష నౌక నిర్మాణం నుంచి ఆధునిక యుద్ధ, సహాయక నౌకల తయారీ వరకు హెచ్‌ఎస్‌ఎల్‌ ప్రస్థానం సాగిందని కొనియాడారు. 2025లో సంస్థకు ‘మినీ రత్న’ హోదా లభించిందని తెలిపారు.

ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌లు సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించే యుద్ధ నౌకలకు ఇంధనం, ఆహారం, ఇతర అవసరమైన సామగ్రిని అందిస్తాయి. దీంతో సుదీర్ఘ సముద్ర కార్యకలాపాల్లో నౌకాదళ సామర్థ్యాన్ని పెంచడంలో వీటికి ప్రాధాన్యం ఉంటుంది.

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ కేవలం నౌకల నిర్మాణ సంస్థ మాత్రమే కాదని, దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే కీలక వ్యవస్థ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. సముద్ర సంబంధిత నిబంధనలను పాటిస్తూ దేశ భద్రతతో పాటు సముద్ర వనరుల పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ ద్వారా దేశ రక్షణ రంగంలో స్వావలంబన మరింత పెరుగుతుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మారిటైమ్‌ రంగ అభివృద్ధికి సహకరిస్తోందని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. 26 ఏళ్ల క్రితం రవాణా మంత్రిగా విశాఖకు వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. ఇప్పుడు రక్షణ మంత్రిగా హెచ్‌ఎస్‌ఎల్‌ను సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యం సాధించాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here