భారత మహిళల క్రికెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా సీనియర్ ప్లేయర్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. తన నిర్ణయాన్ని ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ ప్రకటనతో పంచుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని హర్మన్ వెల్లడించింది.
‘నా బాధ్యతను నిర్వర్తించా’
కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అంత సులభమైన నిర్ణయం కాదని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. ఈ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు, మరచిపోలేని క్షణాలు ఉన్నాయని తెలిపింది. జట్టు మంచి స్థితిలో ఉందనే నమ్మకంతోనే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది.
ఇకపై ప్లేయర్‌గా పయనం
“నా బాధ్యతను నేను నిర్వర్తించానని భావిస్తున్నా. జట్టుకు నా దగ్గర ఉన్నదంతా ఇచ్చా. ఇప్పుడు కొత్త పేజీ తిప్పే సమయం వచ్చింది” అని హర్మన్‌ప్రీత్ తెలిపింది. కెప్టెన్సీ ముగిసినా భారత క్రికెట్‌పై తన ప్రేమ ఎప్పటికీ మారదని స్పష్టం చేసింది. ఇకపై ఆటగాడిగా జట్టులో తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్పింది.
స్ఫూర్తిదాయక ప్రయాణం
హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయాలు సాధించింది. 2025లో భారత్ తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. తాజాగా 2026 ఆసియా క్రీడల్లోనూ హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత జట్టు మహిళల క్రికెట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది. శ్రీలంకపై ఫైనల్లో భారీ విజయం సాధించి భారత్ వరుసగా రెండోసారి ఆసియా క్రీడల స్వర్ణాన్ని దక్కించుకుంది.
ఇక హర్మన్ నిర్ణయంపై బీసీసీఐ సహా ప్రముఖ క్రికెటర్స్ స్పందిస్తున్నారు. ఆమె భారత క్రికెట్ కు అందించిన సేవలు నిరుపమానమని అనేకమంది కొనియాడుతున్నారు. అలాగే, దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు కూడా హర్మన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కొత్త నాయకత్వానికి మార్గం
హర్మన్‌ప్రీత్ 2016లో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, 2022లో వన్డే కెప్టెన్‌గా, 2023లో అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా ఎదిగింది. దాదాపు దశాబ్దం పాటు టీ20 నాయకత్వం వహించిన ఆమె.. ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవడంతో భారత మహిళల జట్టులో కొత్త నాయకత్వానికి మార్గం ఏర్పడింది.
ఈ క్రమంలో ప్రస్తుత వైస్ కెప్టెన్ స్మృతి మంథాన ఈ రేసులో ముందుంది. గత కొన్నేళ్లుగా జట్టు సాధించిన అనేక విజయాల్లో ఆమె కీలక భూమిక పోషించింది. త్వరలోనే ఇందుకు సంబంధించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది.







































